మోర్తాడ్, బతుకమ్మ:కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నాణ్యమైన విత్తనం ప్రతి గ్రామానికి అనే ప్రోగ్రాంలో భాగంగా వరి పంటలో క్షేత్ర దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పి.విజయ్ కుమార్ సస్యరక్షణ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూరు మాట్లాడుతూ, ఈ వానాకాలంలో 1200 అనే వరి రకాన్ని జిల్లాలోని అభ్యుదయ రైతులకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉన్నందున ఈ పంటలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ రకం యొక్క గుణగణాలను రైతులకు తెలియజేస్తూ, ఎక్కువ దిగుబడిని ఇస్తుందని పురుగులు, తెగుళ్లను తట్టుకుంటుందని సూచించారు. కావున ఈ విత్తనాన్ని దళారుల ద్వారా అమ్ముకోకుండా తోటి రైతులకి అమ్ముకొని ఎక్కువ లాభాన్ని పొందవచ్చని తెలిపారు, తద్వారా ఈ విత్తనం ఎక్కువ విస్తీర్ణంలో వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ రకం యాసంగికి అనువైంది కాదని కావున రైతులు వానాకాలంలోనే ఈ రకాన్ని వేసుకోవాలని పంట కోత తర్వాత సరైన తేమ శాతం వద్ద నిలువ చేసుకోవాలని సూచించారు. విత్తన నిల్వ కొరకు కార్బెండజిమ్ + మ్యాంకోజిబ్ అనే పొడి మందును 3 గ్రా/కిలో చొప్పున విత్తనానికి కలుపుకొని వచ్చే వానాకాలం కొరకు నిల్వ చేసుకొని విత్తనంగా వాడుకోవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండలం వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, రైతులు సంతోష్, శ్రీనివాస్, మహిపాల్, లక్ష్మి నర్సయ్య, మారుతీ, సురేందర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
