- ఏఐయు కెఎస్ జిల్లా నాయకులు జిల్కర నడ్పి నర్సయ్య
భీమ్ గల్, బతుకమ్మ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐయుకెఎస్ జిల్లా నాయకులు జి.నడిపి నర్సయ్య డిమాండ్ చేశారు. అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏ ఐ యు కె ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం మండల తహసిల్దార్ కు ప్రతినిధి బృందం మెమోరాండంను అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతూ రావడం సరైనది కాదన్నారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలను ఉపసహరించుకుంటున్నామని చెప్పి వాటిని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన చట్టం బిల్లు పేరుతో మళ్లీ కార్పొరేట్ సంస్థలను లాభాలు చేకూర్చే విధంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఈ ప్రమాదకరమైన బిల్లు ఎనభై శాతంగా ఉన్న భారతీయులకు ఆహార భద్రత కు ముప్పాని,మన వ్యవసాయ సార్వభౌమత్వాన్ని నాశనం చేయడమే తప్ప మరొకటి కాదని అన్నారు. మన వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయడం ఏకైక లక్ష్యం తో గ్రామీణ సంతలతో సహా మొత్తం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలను నాశనం చేయాలని కోరుకుంటుంది అన్నారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఎం ఎస్ పీ కోసం చట్టపరమైన హామీ ఇవ్వాలని, చిన్న సన్న కారు, మధ్య తరగతి రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, వ్యవసాయ కార్మికులకు కేంద్రం చట్టం రూపొందించి అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ కార్మికులకు 200 రోజుల పని కల్పించాలని రూ.600 రూపాయల వేతనం ఇవ్వాలని, విద్యుత్తు (సవరణలు) బిల్లు ఉపసవరించుకోవాలని, అడవి హక్కుల చట్టం 2006 సమగ్రంగా అమలు జరపాలన్నారు.ఈ చట్టం ప్రకారం గిరిజన గిరిజనేతర పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని, భూమిలేని వారికి భూమి,ఆకలితో ఉన్నవారికి ఆహారము ఇల్లు లేని వారికి ఇల్లు నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఏ ఐ యు కె ఎస్ మండల నాయకులు టి.సతీష్ , నరసయ్య, లింబన్న , ఏం బద్రి నాయక్ , టీ యు సీ ఐ జిల్లా నాయకులు కే రాజేశ్వర్ , జి అరవింద్, కే నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
