బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని పోచారం గ్రామానికి చెందిన చౌదరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేపట్టాడు. శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి నర్సింగ్ రావు పేరు పై పోచారం గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 287 లో 1 ఎకరం 30 గుంటల భూమి ఉండగా తన అన్న చౌదరి బాపురావు తనకు తెలియకుండా అక్రమంగా పట్టా చేయించుకున్నాడని, తాను బ్రతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లి జీవిస్తున్నానని, కాగా మా అన్న తనకు తెలియకుండా అక్రమంగా పట్టా చేసుకున్న భూమి గురించి తాసిల్దార్ కార్యాలయ అధికారులు విచారణ జరిపించి తనకు రావలసిన భూమిని ఇప్పించాలని కోరుతూ తహాసీల్దార్ కార్యాలయంలో జనవరి 6వ తేదీన వినతి పత్రం సమర్పించానని తెలిపారు. తాసిల్దార్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేసి 3 నెలలు గడుస్తున్న తనకు రావలసిన భూమి పై ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టకుండా, తాసిల్దార్ కార్యాలయం అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. తన అన్న అక్రమంగా పట్టా చేసుకున్న భూమిని విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించడంలో తాసిల్దార్ కార్యాలయం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని రైతు చౌదరి శ్రీనివాసరావు కోరారు.
