కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు, కామారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోశెట్టి ఆధ్వర్యంలో గురువారం ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బందితో కలిసి రామారెడ్డి మండలంలోని కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కన్నాపూర్ తండా, దుబ్బ తండా, స్కూల్ తండా, జగదాంబ తండా, బట్టు తండా తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. తనిఖీల్లో కన్నైగూడెం తండా శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 లీటర్ల బెల్లం పానకం తయారీకి వినియోగించే ఎఫ్‌జే వాష్‌ను గుర్తించి, అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, పరిధిలోని కల్లు దుకాణాలను తనిఖీ చేసి, నాణ్యతా పరీక్షల నిమిత్తం కల్లు నమూనాలను సేకరించారు. అడ్లూర్ టీసీఎస్ డిపో, దేవునిపల్లి టీఎఫ్‌టీ దుకాణం నంబర్–4, అన్నారం టీఎఫ్‌టీ దుకాణం నంబర్–1 వద్ద కల్లు నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నాటుసారా తయారీ, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో అక్రమ మద్యం కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ ప్రత్యేక తనిఖీలు, దాడులు నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

