నిజామాబాద్, బతుకమ్మ :
తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తనువు చాలించింది. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో ఉద్యోగం సంపాదించిన సౌమ్య ఈ నెల 23న నిజామాబాద్ నగర శివారులో గంజాయి మాఫియా జరిపిన దాడిలో కానిస్టేబుల్ గాజుల సౌమ్య హస్పిటల్ లో శనివారం రాత్రి 9.45 నిమిషాలకు తనువు చాలించింది. సౌమ్య తండ్రి గాజుల సాయిలు , తల్లి చంద్రకళ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తమ్ముడు శ్రవణ్ డిగ్రీ పూర్తి చేసి పోలీసు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు సౌమ్య కుటుంబీకులు తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడంలో కానిస్టేబుల్ సౌమ్య విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఎక్సైజ్ శాఖ ప్రతిష్ట పెంచిందని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. సౌమ్య సాహసం అసమానమైనదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ నుండి అడిషనల్ కమీషనర్ వరకు ఆదివారం ఉదయం 8.30 గంటలకు నిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం వద్ద యూనిఫారం తో హాజరై సౌమ్య త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని తెలంగాణ ఎక్సైజ్ అసోసియేషన్ జేఏసీ ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సౌమ్య స్వగ్రామం మోస్రా మండలంలో సాయంత్రం మూడు గంటలకు జరుగుతాయని కుటుంబీకులు వెల్లడించారు.

