నిజామాబాద్, బతుకమ్మ : బాసర ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీ సీట్ల ఎంపికలో అన్ని వర్గాలతో పోలిస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరికి అత్యల్ప కటాఫ్ మార్కులు ఉండటం ఏంటని నరాల సుధాకర్ ప్రశ్నించారు. అదే మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు సీట్లు ఎందుకు రాలేదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు నష్టపోతున్నరన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బడుగు వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను కోల్పోతున్న పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. పది శాతం లేని వారికి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ప్రభుత్వాలు పునరాలోచించకపోతే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుందని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ శంకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, విజయ్, బాలన్న, సదానంద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
