. . . సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 57 పరీక్ష కేంద్రాల్లో సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. శనివారం నిజామాబాద్ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరిండెంట్లు, కళాశాలలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ నుండి 21వ తేదీ వరకు విడతల వారీగా ప్రయోగ పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. అన్ని ప్రయోగ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా, అధికారుల పర్యవేక్షణలోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్ విద్య ఇంటిగ్రేటెడ్ పోర్టల్ లాగిన్ ద్వారా పని చేయాల్సి ఉంటుందనన్నారు. ఇంటర్ బోర్డు నియమ నిబంధనల మేరకే ప్రతి ఒక్కరు పని చేయాల్సి ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థిని, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే జిల్లా ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయంలో పరీక్షలు నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాలల ప్రిన్సిపాల్ లు, చీఫ్ సూపరిండెంట్ లకు అన్ని అంశాల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు కౌసర్ పాషా, నుస్రత్ జహాన్, రజియా సుల్తానా, బాలుర కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ యమున, విషయ నిపుణులైన ప్రిన్సిపాల్ లు, చిన్నయ్య, బుద్దిరాజ్ తో పాటు జిల్లాలోని అన్ని ప్రయోగ పరీక్షల కేంద్రాల చీఫ్ సూపరిండెంట్ లు, ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

