. . . సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.వి.రాజేశ్వర రావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టామని పి.వి. రాజేశ్వర రావు సూపెరింటెండింగ్ ఇంజనీర్ తెలిపారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో 3 ఈ.ఆర్.టీ (ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) వాహనాలను, టీం ను కూడా వినియోగిస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా సబ్‌డివిజన్ స్థాయిలో 14 వాహనాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే అందుబాటులో ఏర్పాటు చేసుకొని, వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యను పరిష్కరిస్తున్నామని ఎస్ఈ వివరించారు. ఈ ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు హఠాత్తుగా సంభవించే సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో దోహదపడుతూన్నాయని పేర్కొన్నారు. ఈ.ఆర్.టీ వాహనాల పై 1912 అని టోల్ ఫ్రీ నంబర్ ముద్రించి కూడా ఉంటుందని, ఎటువంటి సమస్యలకైనా 1912 నంబర్ లో సంప్రదిచాలని కోరారు. 24/7 ఈ టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తుందని వివరించారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని ఎస్ఈ వెల్లడించారు.
