. . . ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన నిజామాబాద్ నగర శివారులోని బోర్గం (పి) గ్రామ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. భూమ్ రెడ్డి కన్వెన్షన్‌కు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్ లో లిఫ్ట్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. భూమ్ రెడ్డి లిఫ్ట్ నిర్మాణ పనులను ఓ గుత్తేదారుకు అప్పగించారు. గురువారం సాయంత్రం గుత్తేదారు ఇద్దరు కూలీలను తీసుకువచ్చి లిఫ్ట్ పనులు చేయిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో సమీపంలోని 33/11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కూలీలు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కిరణ్ (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి దీపక్ తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాలుగో టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ షాక్‌కు గురైన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే కిరణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, నిర్లక్ష్యం అంశాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.