- రిమాండ్ కు తరలింపు
బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని పోచారం, మాల్ తుమ్మెద గ్రామాలతో పాటు మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలంలోని సర్జన, పోచం రాల్ గ్రామాల పరిధిలోని మంజీరా నదిలో రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ విద్యుత్ మోటార్లను వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన పోతరాజు రాములు అలియాస్ తుకారాం, ఈటెల శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు గత 2, 3 నెలల నుండి వరుస విద్యుత్ మోటార్ల దొంగతనాలకు పాల్పడి 18 వ్యవసాయ విద్యుత్ మోటార్లను దొంగతనం చేసినట్లు తెలిపారు. విద్యుత్ మోటార్ల రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఈ ఇద్దరు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగిందన్నారు. ఈ దొంగతనం జరిగిన విద్యుత్ మోటార్లలో కొన్నింటిని మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన బోయిని సత్యం అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. విద్యుత్ మోటార్ల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పోతరాజు రాములు అలియాస్ తుకారాం, ఈటెల శ్రీనివాస్ ల వద్ద నుండి సుమారు 70 వేల రూపాయల విలువైన ఆరు విద్యుత్ మోటార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరచుకున్నట్లు, వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. దొరికిన విద్యుత్ మోటార్లను కోర్టు నిబంధనల ప్రకారం సంబంధిత రైతులకు అప్పగిస్తామని సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై మల్లారెడ్డి, ఏఎస్ఐ ఉమేష్, పోలీస్ సిబ్బంది రాజులు, సందీప్ ఉన్నారు.
