27.5 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. రాజీనామా డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నాందేవాడ చౌరస్తాలో వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఎం. సుప్రియ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి స్వరూప రాణి మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలను అణిచివేస్తూ లాఠీచార్జ్, పొగ బాంబులు, వాటర్ కానన్లను వినియోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు విమర్శించారు. కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరుస్తోందని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతతో పాటు ప్రభుత్వ వైద్య సేవలు కూడా క్షీణించాయని వారు ఆరోపించారు. దీంతో నిరుపేదలు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని అన్నారు. మహిళల భద్రత, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, “బేటీ బచావో, బేటీ పడావో” వంటి నినాదాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వామపక్ష మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనిత, శ్రీదేవి, రజియా, మాజిత, మాధవి, గోదావరి, ఫర్జానా, గీత, సంజన, లక్ష్మీ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article