. . . డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి…
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలను పరిశీలించి కళాశాల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని, డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను మరింత సులభంగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఆధునిక సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు.విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యే భవిష్యత్తుకు బాటవేస్తుందని, ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం ఉంటే జీవితంలో విజయాలు సాధించడం సులభమవుతుందని చెప్పారు. డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకొని ప్రతి సందేహాన్ని వెంటనే నివృత్తి చేసుకుంటూ విద్యలో రాణించాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా వెంకటాపూర్ తండాకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని లక్ష్మి మాట్లాడుతూ, గత ఏడాది అక్టోబర్ నెలలో హాస్టల్ నుంచి కళాశాలకు రాకపోకల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అలాగే ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేసి బాన్సువాడను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్న పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ , కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సలాం,సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి,కళాశాల సిడిసి సభ్యులు ఏజాజ్,దాసరి శీను, విట్టల్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

