27.5 C
Hyderabad
Friday, July 31, 2026

రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి పీఏకు విద్యాశాఖ షోకాజ్ నోటీసులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

. . . వివరణ ఇవ్వకపోతే విద్యాశాఖ చర్యలకు రంగం సిద్దం

నిజామాబాద్, బతుకమ్మ :

విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాప్రతినిధి వద్ద అనధికారికంగా వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వద్ద పీఏగా పని చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల వద్ద పని చేయకూడదని నిబంధనలున్నాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఉపాధ్యాయులు ఎమ్మెల్యేలు, ఎంపీలకు పీఏలుగా పని చేయడంపై నిషేదం విధించాయి. మైలారం పాఠశాలలో పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా పీఏగా పని చేస్తున్నాడని మోపాల్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గోపాల్ అనే సామాజిక కార్యకర్త విద్యాశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అయినప్పటికీ స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దాదాపు ఏడాది కాలంగా ఫిర్యాదులు చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పిటిషన్ దాఖలు చేశారు. దానితో ఇటీవల న్యాయస్థానం జిల్లా విద్యాశాఖాధికారితో పాటు పీఏ శ్రీనివాస్ రెడ్డిలకు శ్రీముఖాలు జారీ చేసింది. శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించకుండా అనధికార సెలవుల్లో పని చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో విద్యాశాఖ ఆలస్యంగా స్పందించింది. అందుకు కారణం అధికార పార్టీ నేత వద్దనే వ్యక్తిగత సహాయకుడిగా పని చేయడమే కారణమని వాదనలున్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఉల్లంఘించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధి తరపున పని చేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి పాఠశాలకు సెలవుల సమయంలోనే హాజరవుతూ పని దినాల్లో స్థానంలో వేరొకరిని డిప్యూటేషన్ పై ఉంచి పీఏగా పని చేస్తున్నట్లు తెలిసింది.

ప్రధానంగా ధర్పల్లి మండల విద్యాశాఖాధికారి జిల్లా విద్యాశాఖలోని కొందరు అధికారులు ఆయనకు సహకరించినట్లు తెలిసింది. 120 రోజులు విధులకు రాకుండా అనధికారికంగా సెలవులో ఉన్న విషయం గుర్తించిన విద్యాశాఖాధికారులు శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 మంది ఉపాధ్యాయులు పీఏలుగా పని చేస్తున్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేయడం విశేషం. విద్యాశాఖ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి గడువు ఇవ్వకుండా సత్వరమే వివరణ ఇవ్వాలని కోరడంతో తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. వివరణ ఇవ్వకపోతే విద్యాశాఖ సస్పెండ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

More articles

Latest article