. . . ఇన్వెస్టెమెంట్ మోసాలు, అడ్వర్టైజ్మెంట్ మోసాలతో జాగ్రత్త
. . . డీఎస్పీ వై. వెంకటేశ్వరావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అధిక లాభాలు వస్తాయని నమ్మి అనుమానాస్పద లింకులు లేదా అపరిచిత కాల్స్‌ను నమ్మకూడదని డీఎస్పీ వై. వెంకటేశ్వరావు అన్నారు. గురువారం పట్టణంలోని కాకతీయ విద్యాసంస్థలలో సైబర్ క్రైమ్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో డిఎస్పీ వై. వెంకటేశ్వరావు నాయకత్వంలో సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా విద్యా రంగానికి చెందిన వారికి అవగాహన కల్పించడం అత్యంత అవసరమని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆయనన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందడంతో పాటు, సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికే నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. కొద్దిపాటి పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పి ప్రజల డబ్బును దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థపై పూర్తి వివరాలు సేకరించాలన్నారు. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ మోసాలు గురించి కూడా వివరించారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లలో తక్కువ ధరకు వస్తువులు ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని వస్తువులు పంపకపోవడం లేదా నకిలీ వస్తువులు పంపించడం వంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. కాబట్టి అధికారిక వెబ్‌సైట్లు, విశ్వసనీయ విక్రేతల ద్వారా మాత్రమే కొనుగోళ్లు చేయాలని సూచించారు. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న “డిజిటల్ అరెస్ట్” అనే కొత్త తరహా మోసం గురించి కూడా ప్రత్యేకంగా వివరించారు. నేర విచారణ సంస్థల పేర్లు చెప్పి వీడియో కాల్ ద్వారా బెదిరించడం, కేసులు పెట్టిస్తామని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయని, పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థలు ఈ విధంగా వీడియో కాల్ చేసి డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే నమోదు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1930 హెల్ప్ లైన్ నంబర్ గురించి వివరించారు. మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేస్తే డబ్బును ఫ్రీజ్ చేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని, ఇది పూర్తిగా ఉచితమని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా టీచర్లకు సైబర్ భద్రతపై స్పష్టమైన అవగాహన కల్పించబడింది. వారు తమ విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయాలని కోరారు. సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజల్లో అప్రమత్తత ఎంతో అవసరమని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా, పాల్గొన్న అందరూ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కడి టీచర్లు, యాజమాన్యం సీసీపీఎస్ నిజామాబాదు సిబ్బంది పాల్గొన్నారు.
