27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆ ఓటు మాకొద్దు..

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై గ్రాడ్యుయేట్ల అనాసక్తి

గతంలో ఓటు హక్కు ఉన్నా.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనే కారణం

కనీస ప్రచారాన్ని మరిచిన అధికార యంత్రాంగం

సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్న అధికారులు

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ: ఓటు హక్కు ఇప్పటికే కలిగి  ఉన్న పట్టభద్రులను మళ్లీ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించడంతో చీర్రెత్తుకుపోతున్నారు. మళ్లీ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడం ఎందుకని, ఆ ఓటు తమకొద్దని విసుగు చెందుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఓటు నమోదు 6వ తేదీతో ముగియనుంది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవడం లేదు. ఇదివరకు ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు సైతం ప్రతి ఎన్నికలో కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనే విచిత్రమైన నిబంధన ఉండడం దీనికి కారణం.  రెవెన్యూ అధికారులు సైతం పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  మరోపక్క డిగ్రీ ఉత్తీర్ణత సాధించి మూడు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క పట్టభద్రుడు నూతనంగా తమ ఓటు హక్కును విధిగా నమోదు చేసుకోవాలని ఎన్నికల నియమావళి చెబుతోంది. ఈ విషయమై ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

ఓటు నమోదుపై ఆశావహుల ఆసక్తి

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగాలని ఆశిస్తున్న కొద్దిమంది అభ్యర్థులు మాత్రం తమకు అనుబంధంగా ఉన్న కళాశాలలు సంప్రదించి పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించి వారికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి ఓటు నమోదుకు కొంతవరకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ పట్టణాల వరకే పరిమితం కావడం గమనార్హం. మరోపక్క ఓటు నమోదుకు ఎన్నికల కమిషన్ ఆన్ లైన్ లో అవకాశం కల్పించింది. అయితే ఇందులో కూడా చాలా నిబంధనలు ఉండడం, ఆన్ లైన్ చేస్తుండగా ఆటంకాలు(ఎర్రర్స్) వస్తుండడంతో గ్రాడ్యుయేట్స్ ఆసక్తి చూపడం లేదు. ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేశాక కూడా రెవెన్యూ అధికారులు స్వయంగా వచ్చి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు వెరిఫై చేసి నిబంధనల ప్రకారం ఓటరు నమోదును ధ్రువీకరించాల్సి ఉంటుంది. కాగా అధికారులు కార్యాలయం నుంచి కాళ్లు బయట పెట్టకుండా గ్రాడ్యుయేట్స్ కు ఫోన్ చేసి మీ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని తహసీల్ కార్యాలయానికి రావాలని లేదంటే దరఖాస్తును తిరస్కరిస్తామని కరాఖండిగా చెబుతున్నారు.  కార్యాలయాల చుట్టూ తిరగలేక ఆన్ లైన్ లో తమ వివరాలు నమోదు చేసుకున్నామని సంబంధిత అధికారులే తమ వద్దకు వచ్చి క్రాస్ చెక్ చేయాలని చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూ ఏదో పనిలో ఉంటూ సెలవులు దొరకని పట్టభద్రులు అంటున్నారు. తాము కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదనే ఎన్నికల కమిషన్ ఆన్ లైన్ విధానాన్ని తీసుకువచ్చిందని, స్థానిక అధికారులు తమ కార్యాలయానికి రావాలని తమకు హుకూం జారీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Don't take that vote..

గతంలో గ్రామస్థాయిలో వీఆర్ఏలు, వీఆర్వోలతో రెవెన్యూ యంత్రాంగం చాలా బలంగా ఉండేదని, గ్రామస్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించే వారిని అధికారులు అంటున్నారు.  ఆన్ లైన్ లో ఓటు నమోదు చేసుకున్న వారి వివరాలను ఇంటికి వెళ్లి ధృవీకరణ చేసుకొని పట్టభద్రుల ఓటు హక్కు ప్రక్రియను పూర్తి చేసేవారని ఇప్పుడు ఆ యంత్రాంగం లేకపోవడం కూడా తీరని లోటుగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే వార్డుకు ఒక బీఎల్ వో గా స్థానిక అంగన్ వాడీ, ఆశ, కారోబార్ వంటి సిబ్బందిని నియమించారు. వీరి ద్వారా ఆన్ లైన్ లో ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించేందుకు భారీ యంత్రాంగం ఉన్నప్పటికీ మళ్లీ పట్టభద్రులను తహసీల్ కార్యాలయానికి రావాలని హుకూం జారీ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని పట్టభద్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు జోక్యం చేసుకొని రెవెన్యూ అధికారులు బీఎల్ వో ల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనతో పట్టభద్రుల ఓటరు నమోదుకు కృషి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని మిగిలిన ఈ ఆరు రోజుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, ఆన్ లైన్ లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కార్యాలయానికి పిలవకుండా ప్రభుత్వ సిబ్బంది నియమావళి ప్రకారం అభ్యర్థి ఇంటికి వెళ్లి వివరాల ధ్రువీకరణ చేసుకొని ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చట్ట సవరణ చేయాల్సిందే!!

  • కుంట గంగాధర్, ఐకేపీ సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

పట్టభద్రులు ప్రతిసారి విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పురాతన ఎన్నికల నియమావళిలో ఉంది.

ఇటీవల ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రం వారు నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారితో మాట్లాడా. ఎమ్మెల్యే, ఎంపీ వంటి సాధారణ ఎన్నికల కోసం ఒకసారి ఓటరుగా నమోదు చేసుకున్న వ్యక్తి జీవిత కాలంలో మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఒకసారి పట్టబద్రుడుగా నమోదైన వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు ఎందుకు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరా.  ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉందని, పార్లమెంటులో చట్ట సవరణ చేస్తే తప్ప ఈ నిబంధన తొలగించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల అధికారి బదులిచ్చారు. చట్టంలో మార్పులు తీసుకురావడానికి పార్లమెంటు సభ్యులు స్వయంగా చొరవ తీసుకొని పార్లమెంటులో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని తద్వారా చట్ట సవరణ చేసి ఒకసారి నమోదు చేసుకున్న పట్టభద్రులు మళ్లీమళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితిని నివారించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రతి ఒక్క పట్టభద్రుడు తమ ఓటు హక్కు నమోదు చేసుకొని సరైన నాయకున్ని నిష్పక్షపాతంగా ఎన్నుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నారు.

More articles

Latest article