26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గంగపుత్రుల పొట్టకొట్టొద్దు

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో తమ ప్రభుత్వ హయాంలో మొత్తం 4కోట్ల 42 లక్షల చేప పిల్లలను వదిలితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సగానికి తగ్గించి 2కోట్ల 20లక్షల చేప పిల్లలను మాత్రమే వదులుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వృత్తి మీదే ఆధారపడి జీవించే గంగపుత్రుల పొట్ట కొట్టొద్దని, సబ్సిడీపై చేపపిల్లల పంపిణీలో కోతపెట్టొద్దని అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(నాగాపూర్ పాయింట్ వద్ద) శనివారం ప్రశాంత్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించారన్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని, గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బాల్కొండ నియోజకవర్గంలోని 262 చెరువులు,  ఎస్సారెస్పీ రిజర్వాయర్ తో కలిపి కోటీ 72 లక్షల చేప పిల్లలు, 69 లక్షల రొయ్య పిల్లలు ప్రతి సంవత్సరం పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్సారెస్పీలో ప్రత్యేకంగా 62 లక్షల చేప పిల్లలను విడుదల చేశామన్నారు.  మత్స్యకారుల అభివృద్ధి కోసం బాల్కొండ నియోజకవర్గంలో 740 టీవీఎస్ మోపెడ్ లు 3 కోట్ల 70 లక్షలతో ఇచ్చామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహాయించి 100 నియోజకవర్గాల్లో 70వేల పై చిలుకు స్కూటీ లు గంగపుత్రులను అందజేసినట్లు తెలిపారు. అలాగే 2 కోట్ల 24 లక్షలతో 43 ఆటో లు, ఒక డీసీఎం, ఊరూరా తిరిగి అమ్ముకునేందుకు 11 మొబైల్ అవులెట్స్, 400పైచిలుకు వలలు అందజేసినట్లు వివరించారు.

 

More articles

Latest article