బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సౌత్ క్యాంపస్ డాక్టరేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు, ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కల కలగానే మిగిలిపోతుందని, గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ విశ్వ విద్యాలయంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ఇదే విషయమై ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం ఉన్నత విద్యా మండలి కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసినప్పటికీ తాత్సరమవుతోందన్నారు. నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తారని జిల్లా ప్రజలు, విద్యార్థులు ఆశ గా ఎదురుచూశామని, కానీ ఇప్పటికే మొదటి కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తయ్యి, రెండవ విడత కు సమాయత్తమైన నేపథ్యంలో పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటును మరింత వేగవంతం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా.సంతోష్ గౌడ్, డా.సరిత, డా.రాహుల్, డా.రమాదేవి, దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.
