. . . గైర్హాజర్ అయిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశం
నిజామాబాద్, బతుకమ్మ :
ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తోలిసారి కొరడా ఝులిపించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు. దీనిని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం ఒక్కో శాఖ వారీగా అధికారులు హాజరు జాబితా పరిశీలించారు. సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి గైర్హాజర్ అయిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ముందస్తు సమాచారం అందించకుండా పలు శాఖల అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సదరు అధికారులకు షోకాజ్ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది మొదటి తప్పుగా భావించి, మెమోలతో సరిపెడుతున్నామన్నారు.ఇక నుంచి గైర్హాజర్ అయితే అధికారుల పై కఠిన చర్యలు ( వేతనాల్లో కోతలు తప్పవని) తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు.
అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావిలతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. 84 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు.

ప్రజలకు అందుబాటులో ఉండి సమర్ధవంతంగా సేవలు అందించాలి…..
సాధారణ సమయాల్లోనూ అధికారులు తమ తమ కార్య స్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతంగా సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇటీవల తాను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన సమయంలో పలువురు విధుల్లో లేని విషయం గమనించడం జరిగిందన్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, విధుల పట్ల అలసత్వం వహించిన వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ తేల్చి చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఆయా కార్యాలయాల పనితీరును, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సాయ గౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

