రామారెడ్డి, బతుకమ్మ : రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగులో శనివారం నీటి ప్రవాహం ప్రమాదకరంగా పెరగడంతో రహదారి శాఖ అధికారులు వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గంగమ్మ వాగు ప్రాంతాన్ని ఆదివారం సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నూతనంగా నిర్మించిన వంతెనకు వెంటనే అప్రోచ్ రోడ్లు నిర్మించాలంటూ అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం వేగంగా స్పందించి అప్రోచ్ నిర్మాణం పూర్తిచేసింది. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూడా సంబంధిత అధికారులకు తగు సూచనలు చేసారు. ప్రస్తుతం వాహనాలు కొత్త వంతెన మీదుగా సురక్షితంగా సాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల చొరవతో తక్షణ స్పందన సాధ్యమవడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

