24 C
Hyderabad
Sunday, August 2, 2026

‘రివర్ ఎడ్జ్’కి వెళ్లిన వారు మునిగినట్టేనా?

Must read

📰 Generate e-Paper Clip

  • నగర శివారులోని భారీ వెంచర్ లో కబ్జాలపై అధికారుల కన్నెర్ర
  • ప్రభుత్వ స్థలాల గుర్తింపు, స్వాధీనానికి చర్యలు
  • తమ పరిస్థితి ఏమిటంటున్న ప్లాట్ల కొనుగోలుదారులు
  • లే అవుట్ కమిటీ చర్యలేమిటో..?
  • వెంచర్ మనుగడపై నీలినీడలు

రివర్ ఎడ్జ్ (నది ఒడ్డున) అంటూ ప్రచారం చేసిన తమను నడి వాగులో ముంచారని ప్లాట్ల కొనుగోలు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండోమెంట్ అధికారులు తమశాఖ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటుండడంతో జిల్లా కేంద్రానికి ఆనుకుని వెలిసిన రివర్ ఎడ్జ్ భారీ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళనకు గురవుతున్నారు.  నేషనల్ హైవేలు 63, 44కు అతి దగ్గరగా, నిజామాబాద్ నగరానికి ఆనుకుని వెలిసిన ప్రైవేట్ వెంచర్ పై భారీ అంచనాలు పెట్టుకున్న వారు ప్లాట్లను కొనుగోలు చేశారు.  ఇరిగేషన్ శాఖ రంగంలోకి దిగితే ఇంకా పరిస్థితి ఏవిధంగా మారుతుంది? అసలు లే అవుట్ కమిటీ చేసిందేమిటి? చేస్తున్నదేమిటి? వెంచర్ ఉంటుందా? అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

నిజామాబాద్, బతుకమ్మ:  ‘రివర్ ఎడ్జ్’ వెంచర్ అంటూ ప్రచారం చేసి తమకు ప్లాట్లు అంటగట్టిన రియల్టర్లు నిండా ముంచారని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానిక్ బండార్ శివారులో అధికారికంగా 216 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేయదల్చిన రియల్టర్లు దేవాదాయ, ధర్మాదాయశాఖ, ఇరిగేషన్ భూములను ఆక్రమించి 300 విస్తీర్ణానికి చేర్చి ప్లాట్లు చేశారు. లోగుట్టు తెలియని ఎంతో మంది అమాయకులు ప్లాట్లను కొనుగోలు చేసి ప్రస్తుతం ఇబ్బందుల పాలవుతున్నారు.

ఆది నుంచి ఆరోపణలే..

భారీ వెంచర్ పై ఆది నుంచి అనేక ఆరోపణలు, ఫిర్యాదులున్నాయి. ఫూలాంగ్ వాగును ఆనుకుని గంగస్థాన్ ఫేజ్-2, ఆర్టీసీ కాలనీ, మహాలక్ష్మినగర్, మానిక్ బండార్ వరకు ఉన్న వెంచర్ కు వెళ్లేందుకు ఆయా చోట్ల బ్రిడ్జిల నిర్మాణ పనులు చేపట్టారు. విలీన గ్రామాల  అభివృద్ధికి(టీయూఎఫ్ డీసీ) కేటాయించిన నిధులను వెంచర్ కు వెళ్లేందుకు నిర్మిస్తున్న బ్రిడ్జిలకు ఉపయోగించారనేది బహిరంగ రహస్యమే. రూ.10 కోట్లు దారి మళ్లించిన వైనంపై అనేక ఫిర్యాదు అందినా గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధి అండదండల కారణంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి.

10శాతం భూమేదీ..?

భారీ వెంచర్ లో వదలాల్సిన 10శాతం భూమి గురించి పట్టించుకునే వారు లేకుండాపోయారు. దేవాదాయ, ఇరిగేషన్ భూములను ఆక్రమించిన వెంచర్ యజమానులు వాటిలోనే 10శాతం భూమిని చూపడం గమనార్హం. ఓ వైపు ఫిర్యాదులు, మరో వైపు ఆరోపణలు వ్యక్తమవుతుండగానే వెంచర్ లోని సుమారు 80శాతం ప్లాట్లు ఇప్పిటికే అమ్మేసుకున్నారు. ఫిర్యాదులపై స్పందించిన ఎండోమెంట్ అధికారులు గత కొద్ది రోజులుగా భూములను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. సర్వే నంబర్ 499లో 30గుంటలు, 480లో 14 గుంటలు, 477లో 2 ఎకరాల 5గుంటలు, 503లో 19 గుంటలు, 548లో 29గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.


Did those who went to 'River's Edge' drown?

కబ్జా భూమిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి..?

ఎండోమెంట్ భూమిని కబ్జా చేసిన రియల్టర్లు వాటిలో ప్లాట్లు చేసి అమ్మేశారు. అయితే ఎండో మెంట్ భూముల్లో  ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ భూమిని గుర్తించి హద్దులు పాతిన అధికారులు రేపోమాపో పెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు.

 

సప్పుడు చేయని ఇరిగేషన్

రియల్టర్లు భారీ వెంచర్ లో ఇరిగేషన్ కాలువల ఆనవాళ్లు  లేకుండా చేసినా సంబంధిత శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు. బచ్చల కుంటను పూర్తిగా కబ్జా చేసిన వెంచర్ నిర్వాహకులు ఇరిగేషన్ కాలువలను సైతం ప్లాట్లుగా మార్చేశారు. ఒకవేళ ఫిర్యాదులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించి తమ పరిధిలోని భూములను గుర్తించే పనిలో పడితే ఇంకెంత మంది రోడ్డుపైకి వస్తారో తెలియని పరిస్థితి ఉంది.

 

లే అవుట్ కమిటీ అనుమతులు ఎలా..?

వందలాది ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేసిన రియల్టర్లు ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతో అసలుకే ఎసరు వచ్చింది. ఎండోమెంట్, ఇరిగేషన్ భూముల గుర్తింపు, స్వాధీనం ప్రక్రియ పూర్తయితే అసలు ఆ వెంచర్ ఉంటుందో? లేదో ? అనే దానిపై చర్చసాగుతోంది. అసలు లే అవుట్ కమిటీ ఇచ్చిన అనుమతులేమిటి? ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా చేసినా ఉన్నతాధికారులు స్పందించకపోవడానికి కారణాలు ఏమిటనేది? తేలితే వెంచర్ రీ ఓక్ అయ్యే పరిస్థితి ఉంది. సంబంధిత రియల్టర్ల లైసెన్స్ సైతం రద్దయ్యే అవకాశాలున్నాయి.

ప్రజలకు సమాధానం చెప్పాలి

  • రాయ్ సింగ్ , 2వ డివిజన్ కార్పొరేటర్

విలీన గ్రామాల అభివృద్ధికి వెచ్చించాల్సిన టీయూడీఎఫ్ నిధులు రూ.10 కోట్లతో ప్రైవేట్ వెంచర్ కు బ్రిడ్జీలు వేసిన అంశంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా నేను, సంబంధిత ఉన్నతాధికారులు వారికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఎండోమెంట్ భూములను కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిల్లో సైతం ప్లాట్లను విక్రయించారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.


Did those who went to 'River's Edge' drown?

More articles

Latest article