- రాజకీయంగా… సేవారంగంలో తనదైన ముద్ర
- నేడు కార్యకర్తలకు ఏడీ ఫౌండేషన్ ద్వారా చెక్కుల పంపిణీ
- వినూత్నంగా కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు
- హాజరుకానున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకుడు అర్వింద్ ధర్మపురి యాభవ ఏట అడుగుపెట్టనున్నారు. 1976 ఆగస్టు 25న మాజీ పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా జన్మించారు అర్వింద్. యువకుడిగా ఉన్న సమయంలో క్రికెట్ లో మంచి ప్రతిభ కనబరిచి హైదరాబాద్ రంజీ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం వ్యాపారవేత్తగా ఎదిగి 2017 సెప్టెంబర్ 17న (తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజున) తండ్రిని ఎదిరించి భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుండే యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఏడాదిన్నరకే 2019 లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసి సంచలనం సృష్టించి, అప్పటి సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపి కల్వకుంట్ల కవితని ఓడించి ఔరా అనిపించారు.
తన గెలుపు గాలివాటం కాదని నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 28 మంది కార్పొరేటర్లను గెలిపించుకొన్న అర్వింద్, తృటిలో మేయర్ పీఠాన్ని కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికలలో తొలిసారి జడ్పిటిసీ స్థానాలను గెలిచి బిజేపి ఖాతాల తెరువడంలో సక్సెస్ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పై భారీ మెజారిటీతో గెలుపొందారు. తన ఆరేండ్ల కాలంలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయల ఏర్పాటు, ఆర్వోబీల నిర్మాణాలు, జాతీయ రహదారుల నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే, మరోవైపు తాను హామీ ఇచ్చిన పసుపు బోర్డు ఏర్పాటు ను ఏకంగా ప్రధాని మోడీ తోనే ప్రకటన చేయించి నిజామాబాద్ లోనే జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు స్వతహాగా రైతు అయిన పల్లె గంగారెడ్డి ని చైర్మన్ గా నియమించడంలో కీలకపాత్ర పోషించారు.

గత ఏడు సంవత్సరాలుగా రాజీకీయంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిదిపై తనదైన ముద్ర వేశారు. అది తన శైలీలో ఓవైపు కాగా మరోవైపు సేవా రంగంలో కార్యకర్తలతో పాటు నాయకుల మన్ననలను పొందారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఎవ్వరు చేయని విధంగా అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులకు గుండె వైద్యంను ఉచితంగా చేయిస్తు సేవా తత్పరుడిగా కీర్తించబడుతున్నారు. ఎంపీగా ఎన్నికవడం కంటే ముందే 12ఏళ్లలోపు ప్రాణాపాయం ఉన్న పేద పిల్లలకు హైదరాబాద్ లోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స అందిస్తూ ఇప్పటివరకు 176మంది పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయించి వారి ప్రాణాలను కాపాడారు. మరోవైపు కార్యకర్తల కోసం దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. బూత్ కార్యకర్తల కోసం అర్వింద్ ధర్మపురి బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా కార్యకర్తలు చనిపోయినా, వివాహం చేసుకున్నా, గృహప్రవేశం చేసుకున్నా, ఎవరైనా అనారోగ్య బారిన పడినా వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇప్పటివరకు 179మంది కార్యకర్తలకు సుమారు 90లక్షలు తన సొంత నిధులను వెచ్చించారు. ధర్మపురి అరవింద్ తన పుట్టిన రోజున సోమవారం నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ లో మరో 76మందికి సుమారు 25లక్షల రూపాయల వరకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హాజరు కానున్నారు. కాగా అర్వింద్ సేవా కార్యక్రమాల పట్ల ఇందూరు ప్రజలు కార్యకర్తలు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు.

