. . . రాముడి ఆదర్శాలను ఆచరించాలి
. . . రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
డిచ్‌పల్లి, బతుకమ్మ :
మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తేనే హిందువులు అయిపోరు, శ్రీరాముడి ఆదర్శాలను ఆచరించడమే నిజమైన భక్తి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులోని మాధవ్‌నగర్ సాయిబాబా ఆలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకి వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నూతన ఆలయ పాలకవర్గ చైర్మన్ పొలసాని మీనా-శ్రీనివాస్‌తో పాటు కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే సమాజంలో శాంతి, సామరస్యం నెలకొంటాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సహా అనేక ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అయోధ్య రామమందిరానికి సంబంధించిన నిధుల వినియోగంలో భారతీయ జనతా పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకలైన దేవాలయాల ఆదాయం, ఆస్తుల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. సాయిబాబా ఆలయ నూతన పాలకవర్గం భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే, ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డిచ్‌పల్లి ఖిల్లా రామాలయ అభివృద్ధికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అలాగే గుండారం–మల్కాపూర్‌లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో మరో ఎనిమిది నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ చైర్మన్ పొలసాని మీనా – శ్రీనివాస్, డైరెక్టర్లు, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక బర్దిపూర్ సర్పంచ్ భాస్కర్, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

