- ఒకే గ్రామంలో 20 మందికి డెంగీ పాజిటివ్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో డెంగీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా ఒకటి, రెండు కేసులు నమోదవుతున్న విషయం విదితమే. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో డెంగీ కలకలం సృష్టిస్తోంది. ఒకే గ్రామంలో 20 మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. పాల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్నగర్ దాదాపు ఇంటికొకరు చొప్పున డెంగీ బారిన పడ్డారు. గత 15 రోజులుగా పలువురు జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వైద్యులు కాలనీలో రెండు మూడు రోజులుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో సుమారు 20 మందికి డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో చిన్నారులు, వృద్ధులు సైతం ఉన్నారు. డెంగీ సోకిన కొందరు కామారెడ్డి జీజీహెచ్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డెంగీ లక్షణాలు ఉన్నవారికి గ్రామంలోనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మలేరియా శాఖ వైద్యులు మందులు అందజేస్తున్నారు. దోమల వ్యాప్తి వల్లనే డెంగ్యూ అని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రెయినేజీలు, రోడ్లను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో ప్రత్యేకంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
