26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అధికారుల కమిటి నివేధిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వంద రోజుల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం రూ.6 వేల కోట్లు

 

. . . జూన్ 1 లోగ ఉద్యోగులకు ఆరోగ్య భధ్రత కార్డులు

 

. . .  ఉద్యోగ సంఘాల జేఎసి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

పే రివిజన్ కమిషన్ (పిఆర్ సి) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నివేదిక ఆధారంగా పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వచ్చే వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.6 వేల కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు. నిధుల ఖర్చు ప్రాధాన్యతలను నిర్ణయించాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ), తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులు ముఖ్యమంత్రి తో సమావేశమయ్యారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

Decision on PRC based on report of committee of officials

 

ఈ సందర్భంగా నాలుగు కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు స్పష్టతనిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వంద రోజుల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం ₹ 6 వేల కోట్లు చెల్లించడంతో పాటు పీఆర్సీపై నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని, ఇది స్నేహపూర్వకమైన ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, జూన్ 1 లోగా ఆరోగ్య భద్రత కార్డులను అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. “ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు. “ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాం. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించాం. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశాం. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టాం” అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

 

Decision on PRC based on report of committee of officials

 

. . . ఉద్యోగ జేఎసి తలపెట్టిన నిరసన కార్యక్రమాల ఉపసంహరణ

సంఘాల డిమాండ్లపై స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం నేతృత్వంలో చాలావరకు ఉద్యోగుల సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేసుకున్నారు. ఈ నెల 5 న తలపెట్టిన నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకున్నట్టు ఉద్యోగుల సంఘాల నేతలు ప్రకటించారు.  ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు మారం జగదీష్, వి. లచ్చి రెడ్డి, ఏలూరి శ్రీనివాస రావు, జి. శ్రీనివాస్ రెడ్డి, పి. దామోదర్ రెడ్డి, జి. సదానందం గౌడ్, వి. రవీందర్ రెడ్డి, వి. రాజశేఖర్, కె. రామకృష్ణ, ఎస్. రాములు తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

More articles

Latest article