25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

తల్లిని కోల్పోయిన క్షణాల్లోనే కూతురు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చిట్యాల గ్రామంలో విషాద ఛాయలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో మంగళవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో తల్లి, కూతురు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. చిట్యాల గ్రామానికి చెందిన నరసవ్వ (70) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న ఆమె కుమార్తె, ధర్మారావుపేట గ్రామానికి చెందిన బాలమణి (40), వెంటనే పుట్టింటికి చేరుకున్నారు. అయితే, బాలమణి తల్లి వద్దకు చేరుకున్న కొద్దిసేపటికే నరసవ్వ తుదిశ్వాస విడిచారు. కళ్లముందే తల్లి మృతి చెందడంతో బాలమణి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాలమణిని అత్యవసరంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మూడు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన ఈ కుటుంబానికి తాజాగా తల్లి, కూతురు మరణం మరో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే రోజు రెండు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిట్యాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకుని, ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

More articles

Latest article