29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

Must read

📰 Generate e-Paper Clip

  • రోజురోజుకి పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు
  • ఆన్‌లైన్‌ బిజినెస్‌ పేరిట ఒకరు
  • వ్యాపారం పేరుతో మరొకరు
  • కరెంట్‌ బిల్లుల పేరుతో ఇంకొకరు
  • బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న వైనం
  •  సైబర్‌ నేరగాళ్ల వలలో సామాన్యులు

 

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో రోజురోజుకి ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది దురాశనే పెట్టుబడిగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్‌లైన్‌లో వచ్చే బిజినెస్‌ యాప్‌లను నమ్ముకుంటూ వాటి ద్వారా లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు  కొందరు.మరికొందరు ల్యాటరీ తగిలిందని గుర్తు తెలియని వ్యక్తులు పంపించే మెస్సేజ్‌లను గుడ్డిగా నమ్మి వాటిని క్లిక్‌ చేస్తూ లక్షల రూపాయలు తమ బ్యాంక్‌ ఖాతాలోంచి ఖాళీ చేసుకుంటున్నారు.అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే ఫోన్‌ కాల్స్‌ నమ్మి వారికి తమ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ఇతర సమాచారం ఇవ్వకూడదని పోలీసులు ఎంత చెప్పినా జనం మాత్రం పట్టించుకోకుండా సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతో విలువైన బ్యాంక్‌ సమాచారం సైబర్‌ మోసగాళ్లకు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా ఎంతో కష్టపడి పిల్లల భవిష్యత్‌ కోసం లేదా కుటుంబ పోషణ కోసం భద్రంగా దాచుకున్న డబ్బును సైబర్‌ నేరాగాళ్ల చేతిలో పెడుతూ లబోదిబోమంటూ చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న తరుణంలో పంజాబ్‌, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు కేటుగాళ్లు ఆన్‌లైన్‌ టెక్నాలజీ ద్వారా జనాన్ని మోసం చేసేందుక కొత్త కొత్త పాచికలు విసురుతున్నారు.

  • ఎస్‌బీఐ యోనో కేవైసీ అప్‌డేట్‌ చేయండి..

ఎస్‌బీఐ యోనో కేవైసీ అప్‌డేట్‌ కోసం పాన్‌ కార్డ్‌ వివరాలు అప్‌డేట్‌ చేయండి.లేదంటే బ్యాంక్‌ అకౌంట్‌ బ్లాక్‌ అవుతుందని సైబర్‌ మోసగాళ్లు మెస్సేజ్‌లు పంపించారు.దీంతో బాధితులు తమకు వచ్చిన మెస్సేజ్‌లోని నీలిరంగు లింక్‌ను నొక్కి సైబర్‌ నేరగాడు చెప్పినట్లుగా గూగుల్‌ ఫారంలో వాళ్ల బ్యాంక్‌ వివరాలు, పాస్‌వర్డ్‌ నమోదు చేస్తున్నారు.ఆ తరువాత తనకు వచ్చిన ఓటీపీ సైతం చెప్పడంతో వెంటనే బాధితుల బ్యాంక్‌ అకౌంట్‌లోంచి డబ్బులు ఖాళీ అయీతున్నాయి.

  • కొంప ముంచుతున్న లోన్‌ యాప్‌లు..

మనం పరిచయం లేకపోయినా తక్కువ వడ్డీకే లోన్‌ ఇస్తామంటూ మెస్సేజ్‌లు పంపుతుంటారు సైబర్‌ మోసగాళ్లు. డబ్బులు అంటే ఎవరికైనా అవసరం ఉంటుంది కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు మన బ్యాంక్‌ ఖాతాలోకి లోన్‌ ద్వారా పొందిన అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. ఇంకేముంది అప్పడే మనం పూర్తిగా వారి చేతిలో ఇరుక్కుపోయామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నాం.ఎంతో మంది లోన్‌ తీసుకున్న కొద్ది రోజులకు మళ్లీ మెస్సేజ్‌ పంపుతారు సైబర్‌ మోసగాళ్లు. అందులో మీరు తీసుకున్న లోన్‌ చెల్లించాలని మెస్సేజ్‌ రావడంతో లోన్‌ పొందిన వారు లోన్‌ పూర్తిగా చెల్లిస్తారు. అయితే సైబర్‌ మోసగాళ్లు మాత్రం మళ్లీ డబ్బులు చెల్లించాలంటూ మెస్సేజ్‌లు పంపుతారు. బాధితులు వారు అడిగిన డబ్బులు పంపకుంటే వారి వాట్సాప్‌కు మహిళల అసభ్యకరమైన ఫొటోలు పంపుతూ మానసికంగా వేధింపులకు పాల్పడుతుంటారు.అంతే కాకుండా బాధితుడి ఫోన్‌లో ఉన్న అన్ని కాంటాక్ట్స్‌కు అసభ్యకరమైన ఫొటోలు పంపుతూ వేధిస్తూన్నారు.

  • 1930 నంబర్‌కు కాల్‌ చేయండి: సైబర్‌క్రైమ్‌ పోలీసులు..

ప్రజలు పెట్టుబడులు పెట్టేముందు లేదా కొత్తగా పరిచయమైన వారితో ఆర్థిక లావాదేవీలను పంచుకునే మందు ఒక్కసారి ఆలోచించాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడికి అనతికాలంలోనే అత్యధిక రాబడి ఇస్తామని చెప్పే ప్రకటనలు, మాటలను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. వంద రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరంలోపే రెండు వందల రూపాలయల రాబడి ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచించడంతో పాటు ప్రకటనలతో మాయమాటలు చెప్పే వారిని ప్రశ్నించాలని సూచిస్తున్నారు. డబ్బులు ఎవరికీ సులువగా రావని, కష్టపడనిదే ఆదాయం రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా సైబర్‌ మోసాలకు గురై, డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌చేసి, ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

More articles

Latest article