24 C
Hyderabad
Sunday, August 2, 2026

నిర్ణీత గడువు లోపు నిర్మాణాలను పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • ఆర్ఓబీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు, డబుల్ బెడ్రూం పనుల పరిశీలన

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. మాధవనగర్ వద్ద కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్.ఓ.బి) పనులతో పాటు ఖలీల్ వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్-నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, అహ్మదీ బజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, 80 క్వార్టర్స్, కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనుల గురించి సంబంధిత  అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పై  అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష జరిపారు. ఆర్.ఓ.బీ పనులు మందకొడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్, ఆర్ అండ్ బీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అప్రోచ్ రోడ్, సర్వీస్ రోడ్ల పనులు జరిపించాలని, ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని అన్నారు. ఈ రీతిన పనులు జరిపిస్తే ఎప్పటిలోగా పూర్తవుతాయని నిలదీశారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్న ఈ ఆర్.ఓ.బీ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వేగంగా పనులు జరిపించాలని ఆదేశించారు. నిర్దిష్ట గడువును అనుసరిస్తూ పనులు చేపట్టకపోతే, గుత్తేదారుకు నోటీసులు జారీ చేయాలని

Constructions must be completed within the specified time frame.

సూచించారు. కాగా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన అహ్మదీబజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయానికి సంబంధించి న్యాయపరమైన అవాంతరాలను అధిగమిస్తూ, అర్హులైన వారికి నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసిన, భవన సముదాయం నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదన్నారు. అదేవిధంగా నాగారం 80 క్వార్టర్స్, న్యూ కలెక్టరేట్ కు ఆనుకుని నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళను లబ్దిదారులకు కేటాయించేందుకు వీలుగా అవసరమైన మరమ్మతులు, పారిశుధ్య పనులు, నెంబరింగ్ వంటి పనులను తక్షణమే జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా విభాగాల పనులను ఏకకాలంలో కొనసాగేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేసినప్పుడే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ డీ.ఈ నివర్తి, నిజామాబాద్ సౌత్ తహసిల్దార్ బాలరాజు తదితరులు ఉన్నారు.

Constructions must be completed within the specified time frame.

More articles

Latest article