. బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయం
. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, బతుకమ్మ : ముస్లిములను బీసీల్లో చేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కులగణన గురించి గొప్పగా చెప్పుకుంటూ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెడుతున్నామంటున్న ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన పెద్ద డ్రామా అని గత ప్రభుత్వం లెక్కల ప్రకారం 1.85 కోట్లకు పైగా(51శాతం) ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లెక్కల ప్రకారం 1.65 కోట్లు (46.25శాతం) ఉన్నట్లు చూపుతోందని, 21లక్షల బీసీలు ఏమయ్యారని ప్రశ్నించారు బీసీ బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనేది ఉంటుందా? ముఖ్యమంత్రి రేవంత్ మంత్రివర్గం మతిలేని చేష్టలు చేస్తోందని విమర్శించారు. అడ్డమైన తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే కేంద్రం ఎందుకు అమోదిస్తుందని ప్రశ్నించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే దానికి తాము వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రిజర్వేషన్ అంశంతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని, బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అన్ని అమలుచేసి ప్రజాక్షేత్రంలో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చకుంటే రేవంత్ సర్కార్ ను బీసీ బిడ్డలు కూల్చడం ఖాయం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
