23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణకు విలన్ కాంగ్రెస్సే

Must read

📰 Generate e-Paper Clip

. . . రాసిపెట్టుకోండ్రి మళ్ళీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్సే

. . . మావోయిస్టులతో చర్చలు జరుపాలని కేంద్రానికి లేఖ రాస్తాం

. . . రజతోత్సవ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వరంగల్, బతుకమ్మ :

 

 

పదేళ్ళ తెలంగాణ పాలనలో రాష్ట్ర ఆదాయాన్ని 90 వేల నుంచి 3.5 లక్షలకు పెంచామని జీడీపీని పెంచిన చరిత్ర తమదేనని అయితే అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ పాలిట విలన్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ ముందుగా జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదుల చేతిలో హతమైన అమరులకు నివాళ్ళర్పించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పదేళ్ళలో రాష్ట్రాన్ని ఎంతో అభివ`ద్ది చేశామన్నారు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులు బాగు చేసి ప్రాజెక్టులను నిర్మించి పంజాబ్ ను మించిన ధాన్యాన్ని పండించామన్నారు. 25 ఏళ్ళ క్రితం టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు ఎంతో మంది ఎగతాళి చేశారని ప్రజల అభిమానంతో ఉద్యమకాంక్షతో రాష్ట్రాన్ని సాధించి పదేళ్ళ పాటు తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్ గా తీర్చిదిద్దామన్నారు. అబద్దాలు చెప్పడంలో  కాంగ్రెస్ కు మించిన వారు లేరన్నారు. హామీలు ఇవ్వడానికి డూబ్లికేట్ గాంధీలు ఢిల్లీ నుంచి వచ్చారన్నారు.

Congress is the villain for Telangana

అధికారంలోకి వస్తే పించన్లు, రైతుబంధులు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు వాటిని అమలు చేసిందా అని ప్రశ్నించారు. విద్యార్థులకు స్కూటిలు, ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు ఇస్తామని మోసం చేశారని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంట్ ఇచ్చామని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెచ్చిన ఉచిత బస్సుతో ఉపయోగం లేదని మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం తప్ప చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ కు సమయం ఇవ్వడానికే తాను బయటకు రాలేదని ఏడాదిన్నర అయిపోయిందని ఇంకేప్పుడు పనులు చేస్తారన్నారు. హెచ్ సీయూ భూములను అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్ రేపు ఉస్మానియా భూములను కూడా అమ్ముతుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని నడపడం చేతగాక కాంగ్రెస్ నాయకులు దివాళా తీయించారని అన్నారు. రాష్ట్రంలో రియల్  ఎస్టేట్ రంగం కుదేలయిందని, భూములు అమ్ముదామన్నా కొనేవారు లేరని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కమిషన్ల ప్రభుత్వం నడుస్తుందని, 20 శాతం కమిషన్లు ఇస్తే కానీ బిల్లులు ఇవ్వడం లేదని అన్నారు. కేంద్రానికి బలం ఉందని నక్స్ లైట్లను చంపుదామని అనడం దారుణమన్నారు. మావోయిస్టు పార్టీ చర్చలకు అంగీకరించిందని, ప్రజాసంఘాలు కూడా చర్చలు జరుపాలని, ఆపరేషన్ కగార్ ను ఆపేయాలని డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్లు ఆపాలని, కేంద్రం మావోయిస్టు పార్టీలతో చర్చలు జరుపాలని తమ పార్టీ కేంద్రానికి లేఖ రాస్తుందని కేసీఆర్ అన్నారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అవి అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ వీపు పగలగొడుతారని అన్నారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పోలీసులు తమ డైరీలో రాసుకోవాలని అప్పుడు వారి లెక్క తేలుస్తామని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ చెప్పినట్లు తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం వరంగల్ సభను అడ్డుకోవడానికి పోలీసులు యత్నించడంపై కేసీఆర్ మండిపడ్డారు.

Congress is the villain for Telangana

More articles

Latest article