28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ అప్పు తెలంగాణకు ముప్పు

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్
  • అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టికొట్టిన కాంగ్రెస్
  • బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టాను సారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ట్రానికి ముప్పుగా పరిణమిస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ సరికొత్త రికార్డులు  నెలకొల్పు తోందని మండి పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టికొట్టిందని, అప్పు తేనిదే పూట గడవదన్న రీతిలో విచ్ఛిన్నకర పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల కాలంలో రూ.2.2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ప్రతీ నెలా రూ. 11వేల కోట్లు, రోజుకు రూ. 360 కోట్లు, గంటకు రూ. 15కోట్లు, ప్రతి నిమిషానికి రూ. 25లక్షల  చోప్పున అప్పులు చేసి ఒక కొత్త పథకం చేపట్టిన పాపాన పోలేదు. మరి ఆ రూ. 2.2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినయి అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెచ్చిన అప్పులతో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క ఎన్నికల హామీని కూడా  అమలు చేయలేద న్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు  కేవలం రూ.2.8 లక్షల కోట్లు మాత్రమేనని, సమైక్య రాష్ట్రం నుంచి వచ్చిన రూ.75వేల కోట్లతో కలిపి మొత్తం రూ. 3.5 లక్షల కోట్లే తెలంగాణ అప్పు అని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం ఇంత కాలం విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు చెంప పెట్టు అని ఆయన పేర్కొన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల విలువ రూ. 4.16 లక్షల కోట్లు అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమం అందని ఇల్లు లేదు అని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలు  కేసీఆర్ ప్రభుత్వ కీర్తి  కిరీటాలుగా జీవన్ రెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ చెప్పు కోవడాని కేముంది? కాళేశ్వరం డ్యామా? కల్యాణ లక్ష్మి స్కీమా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులు అప్పులు తెచ్చి జేబులు నింపు కుంటున్నారని ఆయన ఆరోపించారు.కేసీఆర్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి రూపాయకు పక్కాగా లెక్కలు ఉన్నాయన్నారు. అప్పుగా తెచ్చిన డబ్బు ఏం చేశారంటే చెప్పడానికి కోటి ఎకరాల భూమికి సాగునీరు ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉందని, ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ,  48 వేల చెరువులను పునరుద్ధరించిన మిషన్ కాకతీయ, దాదాపు 13 లక్షల మంది పేద ఇంటి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నా యని ఆయన పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 2.2 లక్షల కోట్లతో తట్టెడు మట్టి ఎత్తలేదని, ప్రాజెక్టులకు ఒక్క ఇటుకైనా పేర్చలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నివర్గాల నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దిక్కుమాలిన పాలనలో  రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం వారూ సంతోషంగా లేరన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమం అందని ఇల్లు లేదు అనడం అతిశయోక్తి కాదన్నారు. కేసీఆర్ పాలనంటే ప్రతీ ఇంట్లో సంతోషం, ప్రతీ కంట్లో ఆనందం అని, కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం అన్నట్టుగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆటకెక్కాయని,  420 హామీలు బుట్టదాఖా లయ్యాయని జీవన్ రెడ్డి పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క వర్గం వారికి ఏమిచ్చారో చెప్పే దమ్ముందా? అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్, సుజీత్ సింగ్ ఠాకూర్, రాజేశ్వర్ రెడ్డి, మాస్త ప్రభాకర్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, శ్రావణ్,పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Congress debt is a threat to Telangana

More articles

Latest article