- అడ్డగోలుగా వాగుతున్న వారి నోళ్లు మూయించడానికే వరంగల్ సభ
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మెడలు వంచడానికి, అడ్డగోలుగా వాగుతున్న వారి నోళ్లు మూయించడానికి వరంగల్ సభ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజల పక్షాన ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది అనే భరోసా ప్రజలకు ఇచ్చేలా లక్షలాదిగా తరలి వచ్చి వరంగల్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27 న వరంగల్ లో నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం నిజమాబాద్ రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి మీడియా మావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధి కోసం 24 సంవత్సరాల క్రీతం పుట్టిన పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీ 25 వ వసంతం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంవత్సర కాలం పాటు రజతోత్సవాలు నిర్వహించాలి అని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. రజతోత్సవ ఉత్సవాల్లో భాగంగానే వరంగల్ ఎల్కతుర్తి లో ఈ నెల 27 న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అగమై పోతున్న తెలంగాణ ను, తమకు అందాల్సిన హక్కులను కోల్పోతున్న ప్రజలకు విముక్తి కల్పించడానికి రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఒక్కడిగా కేసీఆర్ బయలుదేరాడని తెలిపారు. ఉద్యమంలో నేను వెనక్కి పోతే నన్ను రాళ్లతో కొట్టండి అని సబ్బండ వర్ణాలను ఏకతాటిపై తీసుకొచ్చి 14 ఏండ్ల మడమ తిప్పని సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. వచ్చిన తెలంగాణ ను కేసీఆర్ 10 ఏండ్ల జనరంజక పరిపాలనలో అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కరెంట్ కోతల నుండి గట్టెక్కించి , త్రాగు నీరు, సాగు నీరు బాధల నుండి విముక్తి కలిపించి ,కునారిల్లుతున్న వ్యవసాయ రంగాన్ని పండగ చేసి ప్రతి ఒక్కరిని అదుకున్నాడు కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే 1 వ స్థానంలో, జిఎస్డీపి అభివృద్ధి లో దేశంలో 3 స్థానంలో కేసీఆర్ నిలిపారని తెలిపారు. రేవంత్ రెడ్డి 16 నెలల పరిపాలనలో తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం 11 వ స్థానానికి, జిఎస్డీపి లో 3 స్థానంలో ఉన్న రాష్ట్రాము 14 వ స్థానానికి దిగజార్చాడని అన్నారు. ఎన్నికల అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి,కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు గూబ గుయ్యుమనేలా సమాధానం చెప్పడానికి పెట్టుకున్న సభ వరంగల్ సభ అని తెలిపారు. వరంగల్ సభకు వెళ్తున్నారు అని గ్రామంలో ప్రజలందరికి తెలిసేలా కాంగ్రెస్ నాయకులకు దడ పుట్టేలా ప్రతి గ్రామం నుండి నాయకులు,కార్యకర్తలు వరంగల్ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
