నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కామ్రేడ్ కర్నాటి యాదగిరి జీవితం కమ్యూనిస్టులకు ఆదర్శమని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్నఅన్నారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి సంతాప సభను పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం కోటగల్లీలోని ఎన్.ఆర్ భవన్ లో నిర్వహించారు. ఈ సంతాప సభకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు, నిజాయితీ పరుడు, నిరాడంబరుడు, సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపందా ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన కామ్రేడ్ యాదగిరి కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శమన్నారు. ఆయన మరణం పీడిత ప్రజలకు తీరని లోటన్నారు.

అత్యంత త్యాగపూరిత జీవితo ఆయనదన్నారు. జీవితాంతం ఆదర్శంగా నిలిచి, మరణించిన తర్వాత కూడా తమ శరీరాన్ని, నేత్రాలను దానంచేశారన్నారు. కామ్రేడ్ యాదగిరన్న నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. ఆయన ఆశయాల సాధనలో చైతన్య స్ఫూర్తిగా ప్రజా ఉద్యమాల నిర్మించాలన్నారు. అదే కామ్రేడ్ యాదగిరి అన్నకు నిజమైన నివాళి అని అన్నారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ సహయ కార్యదర్శి సాయన్న, సీఎల్సీ జిల్లా కార్యదర్శి అల్గోట్ రవీందర్, పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, పార్టీ జిల్లా నాయకులు మురళి, నగర నాయకులు బీక్ సింగ్, విఠల్, లక్ష్మీ, లింగం, సాయిబాబా, గంగాధర్, రవి, నర్సక్క, సునందక్క, మహిపాల్, గంగన్న మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

