29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పల్లెల ప్రగతి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అవగాహన సదస్సులో కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గ్రామాల సంపూర్ణ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై సర్పంచ్ లు, గ్రామ సచివాలయ కార్యదర్శులకు బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. స్వచ్చ భారత్ మిషన్ అమలు, పన్ను వసూళ్లు, తడి, పొడి చెత్త, హానికారక, సానిటేషన్ వ్యర్ధాల సేకరణ, వీబీ జీ రాంజీ అమలు తీరు, మౌలిక వసతులు, సదుపాయాల కల్పన, వాటర్ షెడ్ కార్యక్రమాల అమలు, లింకు రోడ్లు, సీ.సీ రోడ్ల నిర్మాణాలు, వీధి దీపాల నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగు నీటి సరఫరా పర్యవేక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణ తీరుతెన్నుల పరిశీలన, పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ లు, కార్యదర్శులు పరస్పర సమన్వయంతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని, తద్వారా సంబంధిత అధికారులు, సిబ్బందితో నిర్దేశిత పద్దతిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చని సూచించారు. ఏ గ్రామానికి ఏం అవసరం ఉంది అన్న వివరాలను ప్రభుత్వం తెలుసుకునేందుకు, తద్వారా అవసరమైన నిధులు, తగిన వనరులను సమకూర్చేందుకు గ్రామ పంచాయతీల సమగ్ర ప్రణాళిక దోహదపడుతుందని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పనులను గుర్తిస్తూ, 2026 – 2029 కాల పరిమితితో కూడిన మూడు సంవత్సరాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందించుకోవా లని అన్నారు. అందరి సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని హితవు పలికారు.

 

Comprehensive plans must be formulated for the development of villages.

 

ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ, అందరి సమన్వయంతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, సమగ్ర ప్రణాళికలు రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకు వెళ్తే పల్లెలన్ని సంపూర్ణ ప్రగతితో వికసిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలు, సర్పంచ్ లు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

 

Comprehensive plans must be formulated for the development of villages.

More articles

Latest article