. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
. మాదిగ అమరవీరులకు ఘన నివాళులు
. కుటుంబాలక రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం

జుక్కల్, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్య రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు, ఉప కూలాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో మంత్రి దామోదర రాజ నర్సింహ గారి నేతృత్వంలో నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. జాతి ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్ల మంత్రి దామోదర రాజ నరసింహతో కడిగారు. అమరవీరుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అమరుల కుటుంబాలకు మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని, ఎన్ని తరాలైనా వారి రుణం తీర్చుకోలేనిది అని లక్ష్మీకాంతారావు అన్నారు. మాదిగ శాసన సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. మంత్రి దామోదర రాజ నర్సింహ తన అపారమైన రాజకీయ అనుభవం, మేధస్సును రంగరించి ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆయన చూపించిన చొరవ, పట్టుదల, చిత్తశుద్ధి, కృషి మరువలేనిది అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని, మాదిగలపై ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధత చిత్తశుద్ధి గొప్పదన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

