26.3 C
Hyderabad
Monday, August 3, 2026

3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

. . . రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ

. . . కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి

. . . నందిపేట, డొంకేశ్వర్ లో కొనుగోలు కేంద్రాలు పరిశీలన

నిజామాబాద్, బతుకమ్మ : 

ఖరీఫ్ -2024 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నందిపేట మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్ గ్రామంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. కేంద్రాలలో మౌలిక సదుపాయాలను, రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. కాంటా సందర్భంగా ఒక్కో బస్తాలో ఎంత ధాన్యం తూకం చేస్తున్నారు, బస్తాలపై కొనుగోలు కేంద్రం వివరాలు, ధాన్యం రకం తదితర వివరాలను పొందుపరుస్తున్నారా లేదా అన్నది గమనించారు. రైస్ మిల్లుల వద్ద తరుగు పేరిట ఏమైనా కోతలు విధిస్తున్నారా అని ఆరా తీయగా, ఈ సీజన్లో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలాంటి కోతలు అమలు చేయడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రవాణా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ సజావుగానే జరుగుతోందని సంతృప్తి వెలిబుచ్చారు. కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు నిరీక్షించకుండా క్రమపద్ధతిలో ధాన్యం బస్తాలను తూకం జరిపించాలని, వెంటదివెంట ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు.

Complete collection of 3.5 lakh metric tonnes of grain

సన్న ధాన్యానికి సంబంధించి సంపూర్ణ వంటి రకాలను సైతం మండల వ్యవసాయ అధికారి ధృవీకరణతో ఫైన్ వెరైటీ కింద కొనుగోలు చేయవచ్చని సూచించారు.జిల్లాలో ఈసారి 670 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించామన్నారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని, సన్నలకు రూ. 500 చొప్పున బోనస్ డబ్బులు సైతం రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నాయని వివరించారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article