- నీటి పారుదల శాఖలో అధికారుల తీరు
- తాత్కాలిక డ్రైవర్ తొలగింపు
- ఆర్మూర్ ఎస్ ఈ పై సీఎంకు ఫిర్యాదు
నిజామాబాద్ బతుకమ్మ : నీటి పారుదల శాఖలో తాత్కాలిక డ్రైవర్ ఉద్యోగం… చాలీచాలని జీతం…. కుటుంబ పోషణ కోసం పని చేసుకుంటున్నారు వేళా.. కొత్తగా వచ్చిన ఎస్ఈ డ్రైవర్ కడుపుపై కొట్టారు. ఏజెన్సీ వాళ్లకు చెప్పి ఉన్న పోస్టును ఊడగొట్టించారు. న్యాయం కోసం తిరిగి వేసారి న తాత్కాలిక డ్రైవర్ ముఖ్యమంత్రికి, మంత్రికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు రాగా, వాటిని తుంగలో తొక్కిన వైనం నిజామాబాద్ నీటి పారుదల శాఖలో చోెటుచేసుకుంది.
తాత్కాలిక డ్రైవర్ తొలగింపు..
ఆర్మూర్ ఎస్ ఈ వాహనం నడిపేందుకు డ్రైవర్గా మీసాల ప్రసాద్ విధుల్లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత కొత్తగా వచ్చిన ఎస్ ఈ వేధింపులు మొదలు పెట్టారు. హైదరాబాద్ నుంచి చుట్టపు చూపుగా విధులకు హాజరయ్యే అధికారికి, డ్రైవర్ కు పని లేకుండా పోతుందని ఆలోచించి నిర్ణయానికి వచ్చారు. డ్రైవర్ సేవలు అవసరపడటం లేదు గనుక తన జీతం నుంచి డబ్బులు ఇవ్వాలని ముడిపెట్టారు. చిన్న జీతగాన్ని కనుకరించాలని వేడుకోగా, చివరకు ఎస్ ఈ ఉంటున్న ఇంటి అద్దె చెల్లింపుకై ఒప్పందం కుదిరింది. కొన్నాళ్లు గడిచాక డబ్బులు ఇస్తే ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయిస్తానని నమ్మబలికారు. బతుకుపై చిగురింపు మొదలైన తాత్కాలిక డ్రైవర్ ఫోన్ పే ద్వారా కొంతమేర ఎస్ఈ కి ముట్ట చెప్పాడు. పర్మినెంట్ మాట దేవుడేరుగు, ఉన్న జీతం నుంచి నెలవారీగా ఇంటి అద్దె చెల్లిస్తుండడం వల్ల బతుకు భారం అవుతుందని గ్రహించాడు. అద్దె కట్టడం కుదరదని, పర్మినెంట్ కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎస్ఈ ని వేడుకున్నాడు. ఫలితంగా ఏజెన్సీకి చెప్పి తాత్కాలిక ఉద్యోగాన్ని ఊడగొట్టించారు.
న్యాయం కోసం సీఎంకు ఫిర్యాదు..
మనసు మార్చుకుని విధుల్లోకి వచ్చేలా చేస్తారని ఎస్ఈ వచ్చినప్పుడల్లా కొన్నాళ్లపాటు చుట్టూ ప్రదక్షిణలు చేసాడు. ఫలితం కనిపించకపోయేసరికి రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితునికి న్యాయం జరిగేలా చూడాల్సిన అధికారులు, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలను తుంగలో వేసినట్లు తెలుస్తోంది. ఏకమైన అధికారులు ఆర్మూర్ ఎస్ ఈ ని కాపాడుకునేందుకే విచారణ జరపకుండా పక్కన పడేసినట్లు అవగతమవుతోంది.
విచారణ గోప్యం : నిజామాబాద్ ఎస్ఈ
బాధితుడు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరపాలని నిజామాబాద్ సర్కిల్ సిఈ కి ఆదేశాలు అందాయి. దీనికిగాను నిజామాబాద్ ఎస్ఈ ని విచారణ అధికారిగా నియమించి వాస్తవాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. తాత్కాలిక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు పై స్పందిస్తే శాఖ పరువు పోతుందని గ్రహించి ఏకా భిప్రాయానికి రావడమే కాకుండా తామంతా ఒకే గూటి పక్షులం అన్నట్లుగా మారిపోయారు. సీఎంకు ఫిర్యాదు చేసిన బాధితుడు మాత్రం న్యాయం జరుగుతుందని, మళ్ళీ విధుల్లో చేరేలా చేస్తారనే గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. విచారణ అధికారి నిజామాబాద్ ఎస్ఈని విషయంపై వివరణ కోరగా, విచారణ గోప్యం (కాన్ఫిడెన్షియల్) గా ఉంటుంది, కార్యాలయ విషయాలు మీకు అవసరం లేదని చెప్పడం గమనార్హం.
