నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా మోపాల్ ఎస్ఐ యాదగిరి గౌడ్ పై సిర్పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సిందు శర్మకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మోపాల్ మండలం సిర్పూర్ తాండ ప్రాంతంలో 12ఏళ్ల క్రితం బొడ్డు గంగారెడ్డి 13.5ఎకరాల భూమి కొనుగోలు చేశారని అందులో కొంత భాగాన్ని విక్రయించారని తెలిపారు. ఇటీవల కొందరు తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నించి కౌలు దారు సాగుచేసిన పంటను ధ్వంసం చేశారని కంచెను రాత్రికి రాత్రే తొలగించి దొంగిలించారని మోపాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నెల 4న బొడ్డు గంగారెడ్డి మరో ఇద్దరితో కలిసి మోకపైకి వెళ్లగా అక్కడ 40మంది వరకు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు. కబ్జాపై తాము న్యాయం స్థానాన్ని ఆశ్రయించాగా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కబ్జాకు యత్నం జరిగిందన్నారు. ఈ విషయంలో ముందస్తుగా మోపాల్ ఎస్ఐకి ఫిర్యాదు చేసిన కబ్జాదారులకు అనుకూలంగా ఉండి సెటిల్ చేసుకోవాలని బెదిరించారన్నారు. తాము తమ పొలం దగ్గరకు వెళ్తే ప్రాణాలు పోతాయని ఎస్ఐ చెప్పినట్టే దాడి జరిగిందన్నారు. తమ గోడును పట్టించుకోకుండా తమపైనే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. ఈ విషయంలో ఎస్ఐపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరారు. స్పందించిన ఇంచార్జీ సీపీ సిందూ శర్మ నిజామాబాద్ ఏసీఫీకి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శనివారం సంబంధిత పూర్తి వివరాలతో తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
