. . . ఐకమత్యంతో మున్నూరు కాపు సత్తా చాటుదాం
. . . డీఎస్ స్ఫూర్తితో మున్నూరు కాపు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తా
. . . ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవంలో ధర్మపురి సంజయ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ
సమాజాభివృద్ధి, రాజకీయంగా బలోపేతం కావాలంటే సంఘ ఐక్యత ఎంతో అవసరమని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ నగర్ నుంచి ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘ సభ్యులు, ప్రతినిధులను ఏకతాటిపైకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఐకమత్యంతో ఉండి మున్నూరు కాపులా సత్తా చాటుదామని అన్నారు. స్వర్గీయ డీఎస్ ఆశయాలకు అనుగుణంగా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని సంజయ్ స్పష్టం చేశారు. మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలని, ఏ కష్టం వచ్చినా జిల్లా కేంద్రంలో నేనున్నానని మర్చిపోవద్దన్నారు. రాజకీయంగా ఎదుగుదలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో 450 పైచిలుకు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలవడం గొప్ప విషయమని ఇంతమందిని ఒకే వేదికపై సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. రాబోవు రోజుల్లో మున్నూరు కాపులతో బ్రహ్మాండంగా సభ నిర్వహించనున్నామని ధర్మపురి సంజయ్ అన్నారు. సన్మాన కార్యక్రమం కోసం ఎంతోమంది శ్రమ దాగిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మీ అందరిని ఇలా చూస్తుంటే ఆనాడు ధర్మపురి శ్రీనివాస్ గుర్తొస్తున్నారన్నారు. ఆయన సంఘానికి ఎంతో సేవ చేశారని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, గ్రామ మండల, స్థాయిలలో మున్నూరు కాపులు ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, ధర్మపురి సురేందర్, బంటు బాలవర్తి, రామ్మర్తి గంగాధర్, కౌడప్ శరత్, బుస్స ఆంజనేయులు, వరాల రాజు, పబ్బు భూమేష్ పలువురు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుమెంబర్లు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

