నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నందిపేట మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. పాఠశాల ఆవరణను, డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. బియ్యం బస్తాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఈగలు, దోమలు వృధ్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ కూడా నీరు నిలువ ఉండకూడదని నిర్వాహకులకు సూచించారు.

ఆహార పదార్థాలు కలుషితం కాకుండా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. చిన్నచిన్న లోపాలను గమనించిన కలెక్టర్, వాటిని సరి చేసుకోవాలని సూచించారు. బాలికలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని అన్నారు. అనంతరం 7వ తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో భేటీ అయ్యారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు వేసి, విద్యార్థినుల అభ్యాసన సామర్ధ్యాన్ని అంచనా వేశారు.

వ్యక్తిగత భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు తప్ప ఇతరులు ఎవరు వచ్చినా వారితో వెళ్లకూడదని జాగ్రత్తలు సూచించారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను విద్యార్థినులకు అందించారు. ఇష్టపడి చదువుకోవాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని ఉద్బోధించారు. వారిలో స్పూర్తిని పెంపొందింపజేశారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయం పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీనివాస్ రావు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శాంతికుమారి తదితరులు ఉన్నారు.

