నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. వివిధ విభాగాల అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే వార్డు ఆఫీసర్లతో క్రమం తప్పకుండా సమావేశమవుతూ నగర పురోభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో నగర పాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో డివిజన్ వారీగా నెలకొని ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను, సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగతం చేసుకుంటూ, అభివృద్ధి ప్రణాళికలపై కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ఇదివరకటి సమావేశంలో నిర్దేశించిన ప్రగతి పనుల పురోగతిని సమీక్షించారు. ఖాళీ స్థలాల పరిరక్షణ, వన మహోత్సవం, పారిశుధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖాళీ స్థలాలను గుర్తించి, వాటి సంరక్షణ కోసం కంచె ఏర్పాటు చేయాలని, ఖాళీ స్థలాలు కబ్జాకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించేలా ఖాళీ స్థలాల్లో విరివిరిగా మొక్కలు నాటించాలని అన్నారు. మీడియన్, అవెన్యూ ప్లాంటేషన్ల నిర్వహణ సమర్ధవంతంగా జరగాలని, ప్రతి మొక్క సంరక్షించబడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి రోజు చెత్త సేకరణ ఆటో ట్రాలీలు ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. అవకాశం ఉన్న చోట డ్రైనేజీలను శుభ్రపరచేందుకు జె.సీ.బీలను వినియోగించాలని సూచించారు. శానిటేషన్ సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యేలా, అన్ని డివిజన్లలో శానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి నివాస ప్రాంతంలో పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడేలా చొరవ చూపాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని అన్నారు. అర్హులైన కొత్త లబ్దిదారులను గుర్తించి ఇళ్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఇప్పటికే మంజూరీలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. అవసరమైన వారికి మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు ఇప్పించాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఈ.ఈ నివర్తి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, వివిధ విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.

