రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

0 9,731

 

. . . ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఖానాపూర్ లోని రైస్ మిల్లులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లును, శ్రీ సిద్ధి రామేశ్వర ప్రైవేటు లిమిటెడ్ మిల్లులను సందర్శించారు. మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తోందని వివరాలు సేకరించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంటదివెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు వి. మోహన్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

 

Collector conducts surprise inspection of rice mills

Leave A Reply

Your email address will not be published.