29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

  • శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్ష

 

ఎడపల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా  ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామ పంచాయతీ, పల్లె దవాఖానా, ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేసి, శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పల్లె దవాఖానా వద్ద సిబ్బంది హాజరు, పేషంట్ల రిజిస్టర్లు పరిశీలించిన కలెక్టర్, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో ఫాగింగ్ లేని విషయం వెలుగులోకి రావడంతో గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్నిసార్లు చెప్పినా ఫాగింగ్ ఎందుకు చేయడం లేదు?” అంటూ నిలదీశారు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి, అన్ని గ్రామాలలో పక్కా ఫాగింగ్ నిర్వహణపై ఆదేశాలు జారీచేశారు. “ఫ్రైడే – డ్రైడే” కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అంతేగాక, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇంటి నిర్మాణం చేపట్టని లబ్దిదారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి నుండి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని అర్హులకు మంజూరుచేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రూ. 1 లక్ష వరకు రుణ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు. అనంతరం ఎరువుల గోడౌన్‌ను పరిశీలించి, రైతులతో ముచ్చటించారు. ఎరువుల లభ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు, సరఫరా తగినంతగా ఉందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 11 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉండగా, కొత్త స్టాక్‌ను ముందస్తుగా తెప్పిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. రైతులు అవసరానికి అనుగుణంగా ఎరువులు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో పలు శాఖల అధికారులు ఉన్నారు.

More articles

Latest article