- సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో రూ.6 లక్షల వసూళ్ళు
- కెమెరాల ఏర్పాటుకు బడా వ్యాపారులపై ఒత్తిడి
- నగర శివారు పోలీస్ స్టేషన్ లో వసూల్ దందా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు శాఖ ప్రజలతో మమేకమై నేరాల నియంత్రణకు కొత్త విధానాలను అవలంభిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖ కమ్యూనిటీ కాంటాక్ట్ పేరుతో స్థానిక స్టేషన్ పరిధిలోని ప్రజలతో మమేకమయ్యేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దాని పేరే కమ్యూనిటీ కాంట్రాక్ట్. పోలీసులు ప్రజలతో కలిసి నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతుంది. అయితే కొందరు కమ్యూనిటీ కాంటాక్ట్ కు కూడా కలెక్షన్ల కోసం వినియోగించడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ నగర శివారులోని పోలీస్ స్టేషన్ లో ఓ ఎస్ హెచ్ వో కమ్యూనిటీ కాంటాక్ట్ కోసమని స్థానికంగా నేరాల నియంత్రణ కోసమని స్థానికుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు కలెక్షన్ కు తెర లేపారు. గతంలో బడా వ్యాపారులను, సామాజిక సేవ కలిగిన లీడర్లను కలిసి సీసీ కెమెరాల ఏర్పాటు చేసేవారు. కానీ సంబంధిత ఎస్సై చిన్నచితక అని తేడా లేకుండా వెయ్యి రూపాయలు వదలకుండా వసూల్ కు తెరలేపారు. స్టేషన్ పరిధిలో నేరాలు పెరిగాయని, నేరస్తులు చిక్కాలంటే సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సంబంధిత స్టేషన్ పరిధిలోని వ్యాపారులను మొదలుకుని షాప్ ల యజమానులను గతంలో నేరసంబంధిత కేసులలో ప్రమేయం ఉన్న యజమానుల నుంచి వసూళ్ళ పర్వానికి తెరలేపారు. ఈ నెలలో సంబంధిత పోలీస్ స్టేషన్ లో రూ.6 లక్షల వరకు వసూల్ చేసినట్లు తెలిసింది. యూనియన్ నాయకులను, అసోసియేషన్ పెద్దలను రప్పించి ఈ తతంగాన్ని నడుపడం విశేషం. వారే కెమెరాల ఏర్పాటు పేరుతో సుమారు రూ.6 లక్షలు వసూల్ చేసి ఈ నెల 24న సంబంధిత ఎస్ హెచ్ వో కు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం.
పోలీసు శాఖ కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా కెమెరాల ఏర్పాటు సామాజిక బాధ్యత అన్నది మరిచి వసూళ్ళ పర్వానికి తెర లేపిన విషయం తెల్సిందే. అయితే రూ.6 లక్షలు చేతికి రాగా వాటితో కెమెరాలు కొనకుండా మళ్ళీ బడా వ్యాపారుల పై కెమెరాలు కొనివ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా రైసుమిల్లుల యజమానులు, ట్రాన్స్ పోర్టు యజమానులకు, పెద్ద వ్యాపార సంస్థలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గతంలోనూ సీసీ కెమెరాల ఏర్పాటును కొన్ని హోటళ్ళ యజమానులకు అప్పజెప్పారు. ఓ హోటల్ యజమాని ఒక్కడే రూ.50 వేలు సంబంధిత ఎస్సైకి ఇచ్చినట్లు తెలిసింది. దానితో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే వరకు రాత్రి వ్యాపారాన్ని (దందా)కు అనుమతించి తర్వాత బైండోవర్ చేసినప్పుడు ఈ వ్యవహరం బహిర్గతమైంది. గతంలోనూ ఆ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాల ఏర్పాటును దాదాపు పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయితీలు తెచ్చే మధ్యవర్తులు (దళారులు) ద్వారా ఈ వ్యవహరం నడిచింది. ఇప్పటికే సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పరిధిలో వసూళ్ళ పర్వం నిరాటకంగా జరుగుతుంది.
కమ్యూనిటీ కాంటాక్ట్ తో ప్రజలకు చేరువ అవ్వాల్సిన పోలీసు శాఖాధికారులు కొందరు అవినీతి ఎస్ హెచ్ వోల వల్ల పోలీసు శాఖ పరువు గంగలో కలుస్తోంది. సంబంధిత పోలీస్ స్టేషన్ ముందు నుంచి నిత్యం ఇసుక మొరం రవాణా అవుతున్నా అవేవి సీసీ కెమెరాలలో రికార్డుల కాకపోవడం విశేషం. అక్రమ దందాలు జరిగితే రికార్డు చేయని కెమెరాలు నేరస్తులను ఎలా పట్టిస్తాయన్న చర్చ జరుగుతుంది. సంబంధిత ఎస్సై తనకు పోలీసు ఉన్నతాధికారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈ విషయంలో తనకేమి కాదని ఢంకా బజాయించి చెబుతున్నాడు. గతంలో పొరుగు జిల్లాలో పని చేసిన సమయంలో సంబంధిత ఎస్సై అవినీతి లీలలు అన్నీఇన్నీ కావు. కానీ నిజామాబాద్ లో తిష్టవేసిన తర్వాత రెండవసారి బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు ఎస్ హెచ్ వో వ్యవహర శైలి పై ఇది వరకే చాలా మంది డీజీపీ వరకు ఫిర్యాదు చేసినా దాఖలాలున్నాయి. కానీ స్థానిక అధికారుల అండదండలతో ఎస్సై రెచ్చిపోతున్నాడన్న చర్చ జరుగుతుంది. కమ్యూనిటీ కాంటాక్ట్ పేరుతో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం జరుగుతున్న వసూళ్ళ దందాపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
