నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం శనివారం ప్రభుత్వ అతిథి గృహానికి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి కి జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంతెని రాజేందర్ రెడ్డి,నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు లు పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు.జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా వివరాలు, అమలు అవుతున్న ప్రగతిపతకాలు, వర్షాకాల నేపథ్యంలో రైతులు సాగు చేసిన పంటపరిస్థితులను జస్టిస్ మాధవి దేవికి వివరించారు.జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ నాల్సా నిర్వహించే కార్యక్రమాలకు చేదోడుగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు.పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రతి జాతీయ లోక్ అదాలత్ కు జిల్లా పోలీస్ శాఖ సంపూర్ణ సహాయ సహాకారాలు అందిస్తున్నట్లు జస్టిస్ మాధవి దేవికి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ఆలోచనధార నుండి వెలువడి నవంబర్ 16 న జిల్లా వ్యాప్తంగా నిర్వాహంచిన స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం చేయడంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థతో కలిసి నడిచినట్లు వివరించారు.న్యాయం కోసం పరితపించే, అభ్యర్థించే ప్రతి పౌరునికి న్యాయసేవలు అందించడంలో జిల్లా పరిపాలన, పోలీస్ శాఖలు, జ్యూడిషియారీ ఉమ్మడిగా ఉండి విధులు నిర్వహిస్తేనే అనుకున్న చట్ట ప్రయోజనాలు ప్రజల దరికి త్వరితిగతిన చేరుతాయని జస్టిస్ మాధవి దేవి అన్నారు.అధికారిక వ్యవస్థల లక్ష్యం రాజ్యాంగ ఫలాలు ప్రజలపరం చేయడమేనని ఆమె అన్నారు.

…పోలీసుల గౌరవ వందనం
ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్ మాధవి దేవికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆమె న్యాయధికారులు, జిల్లా కలెక్టర్,పోలీస్ కమిషనర్, బార్ ప్రతినిధలతో విడివడిగా సమావేశం అయ్యారు.

