ఢిల్లీ, బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి పలు అంశాలు తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్-Iలో మూడు కారిడార్లు ఉన్నాయి (69 కిమీ). ఫేజ్-I ప్రాజెక్ట్‌ను రూ. 22,000 కోట్లతో నిర్మించారు. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణం విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. గత 10 ఏళ్లలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి విస్తరణ చేపట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్-II విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు. ఫేజ్-IIలో 5 కారిడార్లు మొత్తం 76.4 కి.మీ. ఉంటాయన్నారు. ఇది కేంద్రం, రాష్ట్రం కలిసి చేపట్టాల్సిన ప్రాజెక్ట్ (జేవీ ప్రాజెక్ట్) అని, మొత్తం ఖర్చు: రూ. 24,269 కోట్లు ఉంటుందని, కేంద్రం వాటా: 18% (రూ. 4,230 కోట్లు), రాష్ట్రం వాటా: 30% (రూ. 7,313 కోట్లు), రుణం: 48% (రూ. 11,693 కోట్లు) అని తెలిపారు. 2024 అక్టోబరులో చెన్నై మెట్రో ఫేజ్-IIకు (రూ. 63,246 కోట్లు), 2021, ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్-II (రూ. 14,788 కోట్లు), 2024, ఆగస్టులో బెంగళూర్ మెట్రో ఫేజ్-IIIకు (రూ. 15,611 కోట్లు) ఆమోదం తెలిపారన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2025, నవంబరు 4న కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించింది. వాటిపై కేంద్రం కొన్ని స్పష్టీకరణలు కోరగా, వాటికి సమాధానాలు ఇచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపండని కోరారు. హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో ప్రాంతీయ రింగు రోడ్డును (ఆర్ఆర్ఆర్) తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ వృద్ధితో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని. ఇప్పుడున్న ఓఆర్ఆర్ రానున్న 5 సంవత్సరాల్లో సరిపోదని, ఇప్పటికే ఓఆర్ఆర్ పై రోజుకు లక్ష సీపీయూ ఉందని తెలిపారు. ఆర్ఆర్ ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. అందువలన రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేస్తేనే సరైన ఉపయోగం ఉంటుందని సూచించారు. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయండని కోరారు. తెలంగాణ దేశంలో 35 శాతం ఔషధాలు ఉత్పత్తి చేస్తోందని, బందరుపోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుందని తెలిపారు. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రభుత్వ-ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఓ, డిఫెన్స్ పీఎస్యూలు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయని, వాటి పరిధిలో 1,000కి పైగా ఎంఎస్ఎంఈలు – స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయన్నారు.

CM Revanth Reddy meets Prime Minister Modi
