- రేపటి నుంచి తెరుచుకోనున్న కళాశాలలు
- ఆర్థికమంత్రి హామీ మేరకు యజమాన్యాల నిర్ణయం
నిజామాబాద్, బతుకమ్మ : డిగ్రీ, పీజీ కళాశాలల్లో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయెంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ తో చేపట్టిన నిరవధిక బంద్ ను విరమించినట్లు తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజి మేనేజ్ మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అంబోజి హరిప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరి వెంకటేశంలు ఇచ్చిన హామీ మేరకు బంద్ ను విరమిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జారీ చేసిన టోకెన్స్ మొత్తంను వారం రోజుల్లో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర నాయకత్వం జరిపిన చర్చల్లో ప్రిన్సిపాల్ సెక్రటరి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు బంద్ ను విరమించి రేపటి నుంచి కళాశాలలను పున:ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించడానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. క్రిష్ణయ్య, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
