. . . 103 బస్తాల గల్లంతుపై విచారణ
మాచారెడ్డి, బతుకమ్మ :
యూరియా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండగా, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా పంపిణీలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. యూరియా తీసుకోకపోయినా, ఫర్టిలైజర్ యాప్‌లో ‘పర్చేస్డ్’గా నమోదు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు సింగిల్ విండో కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఈ ఘటనపై రైతులు యాప్‌లో సాంకేతిక లోపమా, లేక అధికారుల నిర్లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు యాప్‌లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, సింగిల్ విండో సిబ్బంది నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ప్రాథమికంగా వెల్లడించారు. ఘటనపై నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ అధికారి రామ్మోహన్ మంగళవారం మాచారెడ్డి సింగిల్ విండో కార్యాలయంలో విచారణ చేపట్టారు. సిబ్బంది ఇచ్చిన వివరణలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సుమారు 103 యూరియా బస్తాల గల్లంతు అంశంపై సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
. . . పొరపాటు ఎక్కడ జరిగింది ?
ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతోందని చెబుతున్నప్పటికీ, మాచారెడ్డి ఘటనలో అసలు తప్పిదం ఎక్కడ జరిగిందన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. సిబ్బందికి యాప్‌పై సరైన అవగాహన లేకపోవడమా, లేక స్టాక్ నమోదులో నిర్లక్ష్యమా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పాస్ యంత్రంలో స్టాక్ నమోదైనప్పటికీ, రైతుల ఆధార్ ధృవీకరణ అనంతరం పంపిణీ వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు భావిస్తున్నారు. యాప్‌లో 444 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నట్లు చూపించడంతో రైతులు స్లాట్లు బుక్ చేసుకున్నారు. అయితే కొంతమందికి యూరియా అందించకుండానే ‘పర్చేస్డ్’గా నమోదు కావడంతో గందరగోళం ఏర్పడింది. యూరియా అందని రైతులకు మంగళవారం ఎరువును పంపిణీ చేసిన అధికారులు, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కోఆపరేటివ్ అధికారి రామ్మోహన్ తెలిపారు.
