. . . అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణలో వక్తల పిలుపు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి పని హక్కును కల్పించే బాధ్యత నుండి తప్పుకోవాలని చూస్తుందని, పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ అన్నారు. ప్రగతిశీల మహిళా మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పొడిచి పని హక్కు నుండి తప్పుకోవడానికే నూతన చట్టాన్ని తెచ్చిందని దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే ఎక్కడ పనిచేయాలో నిర్ణయిస్తుందని చెప్పడం ఈ చట్టాన్ని ఆచరణలో విఫలం చేయడానికి అని విమర్శించారు. అందమైన పేర్లను పెడుతూ పేద ప్రజలను వంచిస్తుందని అన్నారు. పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని పని హక్కును నేటి ఆధునిక ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడవంత ధ్వంసం చేస్తూ అటవీ సంరక్షణ చట్టాలంటున్నారు. రైతుల నుండి భూమిని లాగేస్తూ రైతు భరోసాలంటున్నారు, ప్రభుత్వ పరిశ్రమలన్నీటిని మూసేస్తూ మేకింగ్ ఇండియా అంటున్నారని, బడులు మూసేస్తూ బేటి పడావో అంటున్నారని, పచ్చదనం అంతా మింగేస్తూ హరితహారాలు పచ్చ తోరణాలు అంటున్నారని రసాయనాలు వెదజల్లే పరిశ్రమలు పెడుతూ స్వచ్ఛభారత్ అని పాలకులు మురిపిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది ఒకటిగా ఉందని, దశాబ్దాల క్రితం పోరాడి సాధించుకున్న పని హక్కు కోసం, జీవించే స్వేచ్ఛ కోసం నేటికి ఉద్యమించాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఉందన్నారు. కావున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధి హక్కు కోసం, మహిళల హక్కు కోసం ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మార్చి 8న జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, కోశాధికారి గొంట్యల సంజన, జిల్లా కమిటీ సభ్యులు నీలం లక్ష్మి , పొన్ను మానస, అంగిరేకుల వాణి, కీర్తి పాల్గొన్నారు.
