. . . మెడిలైఫ్ కంపెనీపై మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ అరెస్టు
. . . జిల్లాలో 400 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా అక్రమంగా డిపాజిట్లు సేకరణ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మెడిలైఫ్ కంపెనీ పేరిట తమిళనాడుకు చెందిన సంస్థ చేపట్టిన అక్రమ మల్టీ లెవల్ బిజినెస్ చట్టవిరుద్దమైన డిపాజిట్ల సేకరణ, అధిక వడ్డి, కమిషన్ల పేరుతో జరుగుతున్న దందాపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మెడిలైఫ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ గా ఎస్.సాగర్ ద్వారా 400 మంది నుంచి సుమారు రూ.3 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు ఏసీపీ తెలిపారు. అమాయకుల నుంచి 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలని, సదరు డిపాజిట్ ల పైన మొదట వారానికి 4% కమిషన్ అనగా లక్షకు 4,000 రూపాయల చొప్పున 52 వారాలు పూర్తిగా ఇస్తామని చెప్పి చైన్ సిస్టమ్ స్కీమ్ లో మెంబర్లుగా జాయిన్ చేయించినట్లు తెలిపారు. ఆగస్టు 2024 వరకు ఇచ్చి ఆ తరువాత రూల్స్ ఒప్పు కోవడం లేదని, పాత మెంబర్ల యొక్క డిపాజిట్ల పైన, ఉండే కొత్త గా వచ్చే డిపాజిట్ ల పైన మినిమం ఒక లక్ష డిపాజిట్ చేయాలని కొత్త డిమాండ్ తెచ్చారని తెలిపారు. ఆ డిపాజిట్ ల పైన అక్టోబర్ 2024 నుండి నెలకు 5% చొప్పున కమిషన్, వడ్డీ ఇస్తూ మెంబర్స్ తమ డిపాజిట్ల ను 6 నెలల తరువాత ఎప్పుడైనా విత్ డ్రా చేయాలనుకుంటే డిపాజిట్ చేసిన పూర్తి డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరినీ నమ్మిస్టూ చైన్ సిస్టం లాగా డిపాజిట్లు చేశారని తెలిపారు. అందులో సభ్యులు తమ క్రింద 6 గురిని జాయిన్ చేయిస్తే వారు కూడా తమ క్రింద ఇలా 14 లెవెల్స్ లో ఇంకా కొంత మందిని డిపాజిట్ చేయిస్తే కమిషన్, గోల్డ్, సిల్వర్ కాయిన్, బైకులు, గిఫ్ట్ లు ఇస్తామని ఆశ చూపి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 400 మంది అమాయక ప్రజల నుండి దాదాపు సంవత్సర కాలం నుండి సుమారు మూడు కోట్లకు పైగా వరకు అక్రమంగా డిపాజిట్ చేయించారని తెలిపారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిజామాబాద్ నగర సిఐ శ్రీనివాస్ రావు, 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నిజామాబాద్ మెడిలైఫ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ ఎస్.సాగర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపామని తెలిపారు. సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ అయిన రవిచంద్రన్,మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ లపై అక్రమ మనీ సర్క్యూలేషన్ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు.
