- విద్యార్థులపై పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలి
- సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం. ఎం.సుధాకర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుండి తక్షణమే బుల్డోజర్లను వెనక్కి పిలిపించాలని, విద్యార్థులపై పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం. ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం. ఎం.సుధాకర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో అనేక రకాల వృక్షాలకు జంతువులకు పర్యావరణానికి నిలయంగా ఉన్న భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించడం సరైంది కాదన్నారు. పండగ సెలవురోజు, అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో పర్యావరణ విద్వాంసానికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ విధ్వంస కాండను నిరసించిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తున్నామన్నారు. ఒకవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతులను పాటించడం ఆ పార్టీ ద్వంద వైఖరిని తెలియజేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బేషజాలకు పోకుండా, హెచ్సీయూ విద్యార్థులతో, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి తగు పరిష్కారం రూపొందించాలన్నారు. తక్షణమే చెట్ల తొలగింపు ప్రక్రియను ఆపేసి, విద్యార్థులపై నిర్బంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిచో విద్యార్థులు, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కేగణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, టియుసిఐ జిల్లా నాయకుడు ఎన్.రవి తదితరులు పాల్గొన్నారు.
